ముస్లీంలు హాయిగా ఉండొచ్చు,ఆవు మాంసం తినొద్దు!
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా గోమాంసం అంశంపై వివాదం రగులుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
భారత్‌లో ముస్లింలు హాయిగా ఉండవచ్చని, అయితే వారు ఇక్కడుండాలంటే గోమాంసం తినడాన్ని మానివేయాలని వ్యాఖ్యానించారని వార్తలు వస్తున్నాయి. హిందువులకు గోవులు అత్యంత పవిత్రమైనవని, ముస్లింలు ఆవు మాంసం తింటే హిందువుల పవిత్రమైన భావాలను అవమానించినట్టేనన్నారు.

మన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే దానికీ ఓ హద్దు ఉంటుందన్నారు. దాద్రి ఘటన పైనా ఆయన స్పందించారు. ఆ ఘటన జరగడం దారుణమేనని, కానీ గోమాతను ఉద్దేశించి ఇఖ్లాక్ అవమానకర వ్యాఖ్యలు చేసి స్థానిక హిందువులను రెచ్చగొట్టాడన్నారు.
అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం నాడు దీనిపై వివరణ ఇచ్చింది. ముస్లీంలు ఇక్కడ ఉండాలంటే, గోమాంసం తినడం మానివేయాలని సీఎం చెప్పలేదని తెలిపారు. ముఖ్యమంత్రి అందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఏం చేయలేదని చెప్పారు.
అందరినీ గౌరవిస్తామని, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రాసిన పత్రిక తీరును తప్పుబట్టారు. కాగా, ఓ ఆంగ్ల పత్రికలో ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. పత్రిక ఇంటర్వ్యూలో అతను చెప్పారని పేర్కొంది.












Click it and Unblock the Notifications