యువతులకు వల: మధు రివర్స్ క్వొశ్చన్స్?
హైదరాబాద్: వందల మందిని వంచించి, వేల మంది యువతులకు వల వేసిన మహా మాయగాడు మధు దర్యాప్తు అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడట. సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితులను పోలీసులు ప్రశ్నిస్తారు. కానీ, అది మధు విషయంలో రివర్స్ అయిందంటూ శనివారం వార్తలు వచ్చాయి.
న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని మధును మూడో రోజు శుక్రవారం కూడా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అయితే, సైబర్ క్రైమ్ పోలీసులకు మధు నుంచే ఎదురు ప్రశ్నలు వచ్చినట్లు చెబుతున్నారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో మంచి భవిష్యత్తుకు సలహాలు ఇస్తానంటూ తాను యువతులను వంచించినట్లు మధు అంగీకరిస్తున్నాడట.

అయితే తాను ఎవరినీ మోసం చేయలేదని, బలవంతంగా ఎవరిపైనా అత్యాచారం చేయలేదని, అలాంటప్పుడు తాను తప్పు చేసినట్లు ఎలా అవుతుందని అతగాడు ప్రశ్నిస్తున్నాడని అంటున్నారు. మధు చేతిలో మోసానికి గురైనట్లు అనుమానిస్తున్న మహిళలను సంప్రదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే, పోలీసుల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదని అంటున్నారు. ఇది మధుకు కలిసి వస్తుందని అంటున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రిజిష్టర్లలో ఓవర్, డేంజర్, వేస్ట్ అంటూ రిమార్క్స్ పెట్టిన వారిని గుర్తించి ఫిర్యాదులు తీసుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.
అయితే, వాటిలో కొన్ని ఫోన్లు పనిచేయకపోవడం, మరికొన్నింటికి సరైన స్పందన రాకపోవడం వంటి సమస్యలు పోలీసులకు ఎదురవుతున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితుడిపై పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications