గుజరాత్‌లో పవన్ కళ్యాణ్: అమరావతికి గైర్హాజరే?
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలంటూ పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఆహ్వానాన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవడంలేదని సమాచారం. సర్దార్ చిత్రం షూటింగ్ కోసం ఆయన గుజరాత్ రాష్ట్రానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా విడుదలైంది. అక్టోబరు 22న అమరావతి శంకుస్థాపన జరుగుతుంది. కానీ సర్దార్ షూటింగ్ షెడ్యూల్ ఆ రోజు కూడా ఉండటంతో ఇక పవన్ కళ్యాణ్ రానట్టేనని తెలుస్తోంది.

ప్రభుత్వం తను చేసే పనిని చేసుకుపోతుంది కదా, శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినవారంతా సంతోషంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. అనుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు నేరుగా కలిసి ఆహ్వానపత్రిక అందించి శంకుస్థాపనకు రావాలని పిలిచారు.
అలాగే తమ నాయకుడిని చంద్రబాబు స్వయంగా ఆహ్వానించాలని జనసేన కార్యకర్తలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తమ స్పందనలను తెలియజేశారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని పట్టించుకున్నట్లు లేరు. ఏమైనా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications