ట్రంప్ వల్ల భారత ఐటీకి ఊహించని మేలు: అంబానీ, ‘తండ్రి మాటే మార్చేసింది’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక వీసా నిర్ణయాలు ఓ రకంగా భారత ఐటీ ఇండస్ట్రీకి, ఇక్కడి టెక్నాలజీ నిపుణులకు మరిన్ని మంచి అవకాశాలను దగ్గర చేయనుందని,
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక వీసా నిర్ణయాలు ఓ రకంగా భారత ఐటీ ఇండస్ట్రీకి, ఇక్కడి టెక్నాలజీ నిపుణులకు మరిన్ని మంచి అవకాశాలను దగ్గర చేయనుందని, ఇండియాలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.
బుధవారం జరిగిన ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. ట్రంప్ రక్షణాత్మక ధోరణులు భారత ఐటీ రంగంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ట్రంప్ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు. అతి పెద్ద మార్కెట్ అయిన మన దేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమ.. ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టొచ్చు' అని ఆయన పేర్కొన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి..
సంపన్న దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటాన్ని పట్టించుకోనవసరం లేదని.. దేశీ పరిశ్రమలు దేశ సామర్థ్యాన్ని పెంపొందించడంపైనే దృష్టి సారించాలని అంబానీ సూచించారు. ప్రస్తుతం డిజిటైజేషన్ ప్రపంచంలో అపార అవకాశాలు ఉన్నాయని వీటిని అందిపుచ్చుకోవాలంటే భాగస్వామ్యాల ద్వారానే సాధ్యపడుతుందని అంబానీ పేర్కొన్నారు.

పదికోట్ల మంది జియో యూజర్లు..
ఆర్‌జియో ఖాతాదారుల సంఖ్య 10 కోట్లు దాటిందని ముకేష్ అంబానీ ప్రకటించారు. ‘జియో ప్రారంభించినపుడు వీలైనంత తక్కువ కాలంలోనే ఈ లక్ష్యాన్ని సంపాదించాలనుకున్నాం. దీన్ని కొద్ది నెలల్లోనే సాధిస్తామని అసలు ఊహించలేదు' అని అంబానీ అన్నారు. ఆధార్ ఆధారిత ఇకెవైసి ద్వారా అప్పటికపుడు కనెక్షన్లు ఇస్తుండడం ఇందుకు బాగా దోహదం చేస్తోంది. 83 రోజుల్లోనే ఐదు కోట్ల మంది ఖాతాదారులను సంపాదించింది. ఇప్పటికీ రిలయన్స్ జియో రోజుకు సగటున 6 లక్షల మంది కొత్త ఖాతాదారులను సంపాదిస్తోంది.

అడ్డంకులను అధిగమించాలి..
డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను కోట్ల మందికి అందుబాటులోకి తేవడం, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకోవాలని అంబానీ సూచించారు. డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ప్రైవసీ, భద్రత, డేటా చౌర్యంపరమైన సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరించగలిగితే అడ్డంకులన్నీ అధిగమించగలమని, సమస్యలన్నింటికీ తగు పరిష్కారాన్ని కనుగొనగలమని చెప్పారు.

వెఫల్యాలకు భయపడలేదు..
వ్యాపారవేత్తగా విజయం సాధించాలంటే ఇన్వెస్టర్ల సొమ్మును మన డబ్బుకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలని, సరైన టీమ్ ఉండాలని, తక్షణ ప్రయోజనాల ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలని అంబానీ సూచించారు. వ్యాపార విధానాల గురించి తన తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి తొలి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. వ్యాపారాల్లో వైఫల్యాలు సర్వసాధారణమేనని అంబానీ చెప్పారు. తాను కూడా విజయాలు సాధించడానికి ముందు వ్యక్తిగతంగా అనేక వైఫల్యాలు చవిచూశానని తెలిపారు.

నాలుగో పారిశ్రామిక విప్లవానికి డేటానే ఇంధనం..
ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత నాలుగో పారిశ్రామిక విప్లవంగా ప్రపంచాన్ని చుట్టేస్తోందని అంబానీ చెప్పారు. దీనికి డేటానే 'కొత్త ఇంధనం'గా మారిందన్నారు. 'నాలుగో పారిశ్రామిక విప్లవానికి పునాదులు కనెక్టివిటీ, డేటానే. డేటానే మనకినప్పుడు సరికొత్త సహజ వనరు. ఇదే కొత్త ఇంధనంగా మనం కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం' అని అంబానీ పేర్కొన్నారు. దీనిలో భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి సంబంధించి 2015లో అత్యంత దిగువన 155వ స్థానంలో ఉన్న భారత్‌ను.. రాబోయే రోజుల్లో టాప్-10లోకి చేర్చేందుకు తమ జియో సేవలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు.

మార్చేసిన తండ్రి మాట
నాస్కామ్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ముకేశ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ అనేకమంది నిరాశావాదులు, నెగిటివ్ ఆలోచనాపరులు ఉంటారని, అయితే అసలైన వ్యాపారి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఆశావాదంతోనే ఉండాలని అన్నారు. ఒక సమస్యను పరిష్కరించే లోపే మరో సమస్యను సిద్ధం చేసుకుంటేనే సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త అవుతారని ఆయన అన్నారు. స్టాన్‌ఫర్డ్ నుంచి చదువు ముగించుకొని రాగానే, మా తండ్రిగారిని (ధీరూభాయ్ అంబానీ)ని ‘నా ఉద్యోగమేమిటీ... నేనేం చేయాలి' అని అడిగాను. ఉద్యోగివైతే నువ్వు మేనేజర్‌గా ఉంటావ్. వ్యాపారివైతే, ఏం చేయాలో నువ్వే నిర్ణయిస్తావ్... ఇప్పుడు తేల్చుకో నువ్వేం కావాలనుకుంటున్నావో.. అని ఆయన చెప్పారు. డబ్బు మాత్రమే వ్యాపారానికి పరమావధి కాదనీ సమాజలబ్ది ప్రధాన ధ్యేయంగా ఉండాలని అన్నారు.












Click it and Unblock the Notifications