83 ఏళ్ల వయసులో అన్నం మానేసిన అమితాబ్ బచ్చన్..
ఈ వయసులోనూ అదే ఉత్సాహంతో, ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఆసక్తికరమే. ఇటీవల ప్రముఖ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వేదికగా తన ఆహార నియమాల గురించి మాట్లాడుతూ.. తాను అన్నం తినడం పూర్తిగా మానేశానని, ఖీర్ కూడా తీసుకోవడం లేదని వెల్లడించారు. అమితాబ్ తీసుకున్న ఈ వ్యక్తిగత నిర్ణయం ఇప్పుడు పెద్దల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. వయసు పెరిగిన తర్వాత అన్నం పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తుందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నం మానేయడం అనేది ఆయన వ్యక్తిగత ఆరోగ్య ప్రాధాన్యతలకు సంబంధించిన నిర్ణయం. వైద్యుల సలహా ప్రకారం లేదా తన ఫిట్‌నెస్ కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయితే, ఒక సెలబ్రిటీ చేశారు కదా అని 70 లేదా 80 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదని ప్రముఖ ఎండోక్రినాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ప్రధాన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టే ముందు రక్తంలో షుగర్ లెవల్స్, శారీరక బరువు, కండరాల దృఢత్వం, ఆకలి వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

అన్నం తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయా?
తెల్లటి అన్నం త్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్. కూరగాయలు, ప్రొటీన్ లేకుండా కేవలం అన్నం మాత్రమే ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అలా అని అన్నం తినడమే మధుమేహానికి కారణమని చెప్పలేము. మనం తినే పరిమాణం, రోజూ చేసే శారీరక శ్రమ, శరీర బరువుపై ఇది ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితీరు తగ్గడం, కండరాల పరిమాణం తగ్గడం సహజం. ఇలాంటి సమయంలో అన్నం పూర్తిగా మానేస్తే శరీరానికి కావలసిన క్యాలరీలు అందక కండరాల క్షీణత బారిన పడే ప్రమాదం ఉంది.
రైస్ స్థానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
మధుమేహం లేదా పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారు తెల్లటి అన్నం పరిమాణాన్ని తగ్గించుకోవడం మంచిదే. అయితే కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన పనిలేదు. తెల్లటి అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్, చిరుధాన్యాలైన జొన్నలు, రాగులు, సజ్జలు, దంపుడు బియ్యం లేదా ఓట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ అన్నం తిన్నా.. ఒక చిన్న కప్పు బియ్యానికి సమానంగా పప్పు, తగినన్ని కూరగాయలు, పెరుగు మరియు ప్రొటీన్ ఉండేలా చూసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగవు.
వృద్ధాప్యంలో డైటింగ్ కంటే బలవర్ధకమైన ఆహారమే ముఖ్యం!
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధాన ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే విభిన్నమైన ఆహార పదార్థాలను తగిన పరిమాణంలో తీసుకోవడమే ఉత్తమం. 80 ఏళ్ల వయసులో ఆహారాన్ని తగ్గించుకోవడం కాకుండా, శరీరానికి బలాన్నిచ్చే కండరాలను కాపాడుకోవడం అత్యంత ప్రధానం.
అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు అనుసరించే నియమాలు వారికి సరిపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి శరీర తత్త్వం వేరు. కాబట్టి వయోధికులు తమ దినచర్య, ఆరోగ్య పరిస్థితిని బట్టి పోషకాహార నిపుణుల సలహాతోనే ఆహారంలో మార్పులు చేసుకోవడం శ్రేయస్కరం.














Click it and Unblock the Notifications