రివర్స్ వాకింగ్, రివర్స్ జాగింగ్- ఇప్పుడిదే ట్రెండింగ్: మనమూ ట్రై చేస్తే పోలా
వెనక్కి నడవడం, వెనక్కి పరుగెత్తడం.. అంటే రివర్స్ వాకింగ్, రివర్స్ జాగింగ్. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం మాత్రమే కాకుండా, అనేక శారీరక, మానసిక ఉపశమనాలను అందిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. వెనక్కి నడవడం లేదా పరిగెత్తడం ఓ అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఈ వ్యాయామ పద్ధతి బరువు తగ్గడం, శరీర కూర్పు మెరుగుదలను చూపించిందని అధ్యయన ఫలితాలు స్పష్టం చేశాయి. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సమర్థవంతంగా పని చేస్తుంది.

ప్రముఖ పోషకాహార నిపుణురాలు జుహీ కపూర్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెనక్కి నడవడం వల్ల కాళ్ళు బలంగా తయారవుతాయని తెలిపారు. ఈ ప్రక్రియ.. ఇంతకు ముందు మనం నిత్య జీవితంలో ఎప్పుడూ ఉపయోగించని కండరాలకు సైతం పూర్తిస్థాయిలో పని కల్పిస్తుందని, తద్వారా వాటిని బలోపేతం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
మోకాలి నొప్పితో బాధపడేవారు లేదా మోకాలికి గాయాలు తగిలిన వారికి వెనక్కి నడవడం వారి రిహాబిలిటేషన్ కు ఎంతగానో తోడ్పడుతుందని జుహీ కపూర్ సూచించారు. రివర్స్ జాగింగ్ లేదా రివర్స్ వాకింగ్ వల్ల మోకాలిపై ప్రభావం తక్కువగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ బయోమెకానిక్స్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం వెనక్కి పరిగెత్తడం వల్ల ముందు మోకాలి నొప్పి తగ్గుతుందని ఆమె తెలిపారు.
ఈ పద్ధతి ద్వారా కార్డియోప్రొటెక్షన్, అధిక కేలరీల బర్నింగ్, మోకాళ్ళను బలోపేతం చేయడం, కాళ్ళ కండరాలను దృఢపరచడం, నడుము నొప్పి తగ్గించడం, సయాటికా నుండి ఉపశమనం వంటి వాటికి సహాయపడుతుందని పేర్కొన్నారు. మైండ్ అండ బాడీ కనెక్షన్‌ను మెరుగుపరచడంలో వెనక్కి నడవడం ఎలా దోహదపడుతుందో 'ది బాడీ సైన్స్ అకాడమీ' సహ వ్యవస్థాపకుడు వరుణ్ రతన్ వివరించారు.
ముందుకు నడవడం సులభమని, కానీ వెనక్కి నడవడానికి పూర్తి ఏకాగ్రత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాయామం ముందుకు వెళ్లేటప్పుడు వేగాన్ని నియంత్రించే కండరాలకు శిక్షణనిస్తుంది. ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం దిగువ అవయవాల కండరాలను సమర్థవంతంగా ఉత్తేజపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయని రతన్ తెలిపారు.
మోకాలి ఎక్స్‌టెన్సర్ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, వెనక్కి నడవడం వల్ల శరీర సమతుల్యత గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ వ్యాయామం శ్వాసకోశ, హృదయ స్పందన వ్యవస్థలను మరింత మెరుగుపర్చుతుంది. ఇలా చేయడం వల్ల ముందుకు నడిచే వేగాన్ని పెంచడానికి కూడా తోడ్పడుతుంది.
ట్రెడ్‌మిల్‌పైనా రివర్స్ జాగింగ్, రివర్స్ వాకింగ్ చేయవచ్చు. ఇలా చేసేటప్పుడు మన ఆలోచన మొత్తం కూడా శరీరంపైనే ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత సైతం పెరుగుతుంది. మైండ్-బాడీ మధ్య సమన్వయం గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రారంభంలో రోజుకు అయిదు నిమిషాలు రివర్స్ జాగింగ్, రివర్స్ వాకింగ్ చేస్తే చాలని, క్రమంగా దీన్ని 15-20 నిమిషాల వరకు పెంచవచ్చు.
గర్భిణులు, వృద్ధులు, స్ట్రోక్ బాధితులు, లేదా మైండ్ అండ్ బాడీని సమన్వయం చేయలేనివారు ఈ వ్యాయామం ప్రారంభించే ముందు తప్పకుండా తమ వైద్యుడి సలహా తీసుకోవాలి.












Click it and Unblock the Notifications