నెలకు లక్ష నుండి రెండున్నర లక్షలు సంపాదించే ఈ బిజినెస్ కు ఏపీ సర్కార్ అండ!
ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది . పౌల్ట్రీ రైతులు నెలకు లక్ష నుండి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026-29ని ఆమోదించి రూ.657 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకునే రైతులకు 25 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది.
కోళ్ళు బాగా బరువు పెరగాలన్నా, బతకాలన్నా వాటికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. సాధారణ షెడ్స్ లో ఉన్న కోళ్ళు ఎండాకాలం వస్తే మృత్యు వాత పడతాయి. బరువు అనుకున్నట్టు పెరగవు. దాణా వృధా కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వ్యాధులు ఎక్కువ, లేబర్ చార్జ్ కూడా ఎక్కువ. అదే ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్లు కోళ్ళకు కావాల్సిన వాతావరణం ఏర్పరుస్తాయి. తక్కువ దాణాతో ఎక్కువ బరువు పెరుగుతాయి.

వ్యాధులు తక్కువ, లేబర్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఈ షెడ్స్ తో అధిక ఉత్పత్తి సాధ్యం అవుతుంది. సాధారణంగా ఒక ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టాలంటే 10 వేల కోళ్ళ సామర్ధ్యం అయితే 50 నుండి 80 లక్షలు ఖర్చవుతుంది. 20 వేల కోళ్ల సామర్ధ్యం అయితే 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రూపాయలు అవుతుంది.కనుక ఏపీ ప్రభుత్వం ఆధునిక షెడ్స్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తుంది.
ఇది గరిష్టంగా రూ.25 లక్షలు వరకు ఉంటుంది. ఇప్పటికే ఉన్న షెడ్లను ఆధునీకరించాలనుకునేవారికి కూడా 25 శాతం సహాయం ఉంది. గరిష్టంగా రూ.20 లక్షలు వరకు లభిస్తుంది.
విద్యుత్ ఖర్చు తగ్గించేందుకు కూడా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. షెడ్స్ కు యూనిట్‌కు రూ.2 వరకు సబ్సిడీ ఇస్తారు. సంవత్సరానికి గరిష్టంగా రూ.10 లక్షలు, మూడేళ్లపాటు ఈ రాయితీ ఉంటుంది. ఎల్‌టీ పౌల్ట్రీ ఫారాలకు యూనిట్ రేటు రూ.3.75గా నిర్ణయించారు. రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కూడా ఉంది.
ఈ సహాయాలతో రైతులు నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు గ్యారెంటీ కూడా ఇచ్చి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్తున్నారు. గ్రామీణ మహిళలకు బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ ద్వారా అదనపు ఆదాయం కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలను చికెన్ ప్రాసెసింగ్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు.













Click it and Unblock the Notifications
