CEC పై కోర్టు ధిక్కారం ? చిక్కుల్లో కేంద్రం..! సుప్రీంలో కీలక పరిణామం..!
సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పుల్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కు కోర్టు ధిక్కార చర్యల ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సందర్భంగా ఎన్నికల సంఘంలో ఇతర కమిషనర్ల అంగీకారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేష్.. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్నీ బేఖాతరు చేశారు. తోటి కమిషనర్లు అభ్యంతరాలు చెబుతున్నా. పట్టించుకోకుండా కోర్టు తీర్పుల్ని ఉల్లంఘించిన వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ పై కోర్టు ధిక్కార చర్యలకు రంగం సిద్దమవుతోంది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్ని ఉల్లంఘించడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యల కోసం పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ జనరల్ వెంకట రమణిని సుప్రీంకోర్టు లాయర్ బ్రజేష్ సింగ్ కోరారు. తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనంలో పేర్కొన్న విధంగా జ్ఞానేష్.. తోటి కమిషనర్ల కంటే ప్రత్యేకంగా భావిస్తూ, ఏకపక్షంగా తీసుకున్న కోర్టు ధిక్కార నిర్ణయాలపై సమీక్ష అవసరమని బ్రజేష్ సింగ్ తెలిపారు.

గతంలో టీఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని జ్ఞానేష్ కుమార్ స్పష్టంగా ఉల్లంఘించారని బ్రజేష్ సింగ్ ఏజీకి తెలిపారు. అలా కాకుండా ఇతర కమిషనర్లను బైపాస్ చేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ఉల్లంఘనే అవుతుందని ఆయన తెలిపారు. బహుళ కమిషనర్లతో కూడిన స్వతంత్ర వ్యవస్థ అయిన ఈసీని జ్ఞానేష్ నియంతృత్వంగా మార్చారని, తద్వారా ఎన్నికల సంఘం గౌరవాన్ని సైతం తగ్గించారని ఆరోపించారు. ఇది నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియకు నేరుగా ముప్పు కలిగించడమే అన్నారు. ఇప్పుడు బ్రజేష్ సింగ్ కు కోర్టు ధిక్కార పిటిషన్ వేసేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా లేక తప్పించుకుంటుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే తాము కోరుకున్న సీఈసీని నియమించుకుని, ఆయన సాయంతో ఎన్నికలు గెలుస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రానికి ఈ నిర్ణయం మరో పరీక్ష కానుంది.














Click it and Unblock the Notifications
