సింపుల్ గా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై చిటికెలో చేసెయ్యండి!
క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు క్యాబేజీలో ఉంటాయి. క్యాబేజీలో సుమారు 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ క్యాబేజీ ఫ్రై
అందుకే దీనిని ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ కూర చాలా మంచిది. ప్రస్తుతం మనం రుచికరమైన క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ విధానంలో తయారు చేసుకుంటే అసలే క్యాబేజీ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు
క్యాబేజీ – 2 కప్పులు (సన్నగా తరిగింది)
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
వెల్లుల్లి – 3 రెబ్బలు
ఆవాలు – ½ స్పూన్
జీలకర్ర – ½ స్పూన్
కరివేపాకు – కొద్దిగా
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూను
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, స్టవ్ పైన పాన్ పెట్టుకుని, పాన్లో రెండు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఆపై అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యాబేజీ వేసి బాగా కలియబెట్టి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీ బాగా మగ్గనివ్వాలి.
రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ
అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మళ్లీ కలియబెట్టి, మగ్గనివ్వాలి.. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని, కాస్త ధనియాల పొడిని వేసి కలిపి ఫ్రై కానివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన క్యాబేజీ ఫ్రై రెడీ అవుతుంది. దీనిని అన్నం, రోటి, పూరీ ఇలా ఎందులో తిన్నా సరే చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications