50 వేల మంది మృతి.. నాటో సంచలన నివేదిక!
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్దంలో రష్యా సైన్యానికి ఊహించని రీతిలో ప్రాణనష్టం జరుగుతోందని నాటో సంచలన నివేదికను వెల్లడించింది. నాటో సీనియర్ సైనిక అధికారి అందించిన సమాచారం ప్రకారం.. గడిచిన ఒక్క నెలలోనే ఉక్రెయిన్ భూభాగంలో రష్యా 50,000 కంటే ఎక్కువ మంది సైనికులను కోల్పోయింది. వీరిలో దాదాపు 28 వేల మంది రష్యన్ సైనికులు నేరుగా మరణించగా.. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ దళాల నష్టం కేవలం 5,000 వరకు మాత్రమే ఉందని, రష్యాతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆ అధికారి వెల్లడించారు.
ఉక్రెయిన్ దళాలు నిర్మించిన బలమైన రక్షణ వ్యవస్థల కారణంగా రష్యా దళాలకు ఈ స్థాయిలో నష్టం జరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డ్రోన్లు, ల్యాండ్మైన్లు, ఫిరంగి బలగాలు అత్యంత చురుకుగా పనిచేస్తున్న ప్రమాదకర ప్రాంతాలైన కిల్ జోన్లలోకి రష్యా తన సైనికులను పెద్ద సంఖ్యలో పంపుతోంది. ఉక్రెయిన్లో పైచేయి సాధించడానికి రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు విఫలమవ్వడమే కాకుండా.. వారి సైనిక శక్తినే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

ఈ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ పోరాటం కారణంగా రష్యా సైనిక వ్యయం విపరీతంగా పెరిగింది. ఈ ఏడాదికి రష్యా ప్రభుత్వం మొదట అంచనా వేసిన బడ్జెట్ కంటే సైనిక వ్యయం దాదాపు 40 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాల్లో తిరిగి తన భూభాగాలను స్వాధీనం చేసుకుంటుండటంతో రష్యాకు యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది.
రష్యాలో తలెత్తుతున్న ఈ ఆర్థిక, సైనిక సమస్యలు ఆ దేశంలో అంతర్గత, రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని జర్మన్ ఇంటెలిజెన్స్ అధిపతితో సహా పలువురు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన లేదా రాజకీయ మూల్యం చెల్లించకుండా ఈ యుద్ధాన్ని ముగించడం రష్యాకు ఇక ఎంతమాత్రం సాధ్య కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ ప్రాణనష్టం దృష్ట్యా, యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతియుత పరిష్కారం కనుగొనాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి మరింత పెరుగుతోంది














Click it and Unblock the Notifications
