అసలైన రామాయణం నేను చూపిస్తా.. 'వారణాసి' ఓ విజువల్ వండర్.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!
రామాయణం, మహాభారతం ఇతిహాసాల స్ఫూర్తితో ఇప్పటి వరకు తెలుగులోనే కాదు అనేక భాషల్లో వందల సినిమాలు వచ్చాయి. ఇలాంటి ఇతిహాసాలను అద్భుతంగా తెరకెక్కించిన వారూ ఉన్నారు.. అలాగే మేకింగ్ లో తలబడిన వాళ్లూ ఉన్నారు. అయితే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి' చిత్రంపై ఇప్పటికే ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రాజమౌళి ఈ విధంగా మాట్లాడారు.
రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను ఇప్పటి వరకూ దర్శకులు చూపించిన విధానంపై తనకు అసంతృప్తి ఉందని రాజమౌళి స్పష్టం చేశారు. వాటిని భారీ స్థాయిలో మరింత అద్భుతంగా చూపించాలని అనుకునేవాడినని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి మూవీలో రామాయణం నుంచి ఓ కీలక ఘట్టాన్ని చిత్రీకరించే అవకాశం లభించిందని అన్నారు. అయితే ఆ కీలక ఎపిసోడ్ ను కేవలం విజువల్స్ పరంగానే కాకుండా హృదయాన్ని హత్తుకునే విధంగా పాత్రల మధ్య ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా చూపించనున్నట్లుగా తాజాగా ఆయన పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడమే కాదు.. వారణాసి మూవీలో రామాయణం ఎపిసోడ్ గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వారణాసి మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ లోనే రామాయణంలోని కీలక ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లు గతంలోనే రాజమౌళి తెలిపారు. శ్రీ రాముడిగా మహేష్ బాబు చూసి తనకే గూస్ బంప్స్ వచ్చాయని.. అందుకు సంబంధించిన పిక్చర్ ను తన వాల్ పేపర్ గా పెట్టుకున్నానని కానీ ఎవరైనా చూస్తారేమోనని తొలగించినట్లు తెలిపారు. అటు చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా వారణాసి చిత్రంలోని రామాయణం ఎపిసోడ్ గురించి సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాలు ఉండే ఆ సన్నివేశం చూశాక తన నోట మాట రాలేదని.. మహేష్ బాబు విశ్వరూపాన్ని అలా చూస్తూనే ఉండిపోయానని అన్నారు.

అలాంటి అనుభూతి తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. ఇక ప్రస్తుతం వారణాసి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications
