పెరుగుతో ఆలూ కుర్మా.. ఈజీగా ఇలా చేసుకోండి..
ఆలూను పలు రకాలుగా వంట చేసుకుంటారు. ఆలూ టమాటా, ఆలూ ఫ్రై, ఆలూ పచ్చిమిర్చి, ఆలూ కూర్మా ఇలా అనేక విధాలుగా చేసుకుంటారు. అయితే ఆలూ కూర్మా పెరుగు కాంబినేషన్ లో కర్రీ ట్రై చేశారా..? ఇది అన్నం, చపాతీలోకి కూడా టేస్టీగానే ఉంటుంది. మరి పెరుగుతో ఆలూ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
పెరుగుతో ఆలూ కూర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఆలుగడ్డలు మూడు లేదా నాలుగు, నూనె తగినంత, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, పెరుగు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, లవంగాలు మూడు, దాల్చిన చెక్క ఒకటి చిన్నది, యాలకులు రెండు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కారం తగినంత, కొత్తమీర తగినంత, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.
ఆలూ కూర్మా తయారీ విధానం చూస్తే ముందుగా ఆలూను ఉడికించుకోవాలి. పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, పూదీనా వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేయాలి. అల్లం పేస్టు పచ్చి వాసన పోయేంత వరకూ మగ్గించుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో పెరుగు వేయాలి. నూనె సెపరేట్ అయ్యేంతవరకూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి మగ్గించుకోవాలి. ఆ మిశ్రమంలోనే ఆలుగడ్డ ముక్కలు వేయాలి. ఆ తర్వాత గరం మసాలా వేయాలి. మరో 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తరిగిన కొత్తమీర చల్లుకుంటే సరి ఆలూ కుర్మా రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications