మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ కావాల్సిందే..!!
శరీరంలో కనిపించే ప్రతీ లక్షణం.. ఒక సంకేతమే. ఆరోగ్య పరంగా అవయవాల పని తీరును ఈ లక్షణాలతో ప్రాధమికంగా గుర్తించవచ్చు. ఈ సమయంలోనే అప్రమత్తం అయితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. బీపీ, షుగర్ మాదిరిగానే ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందంటున్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలోనే సంకేతాలు శరీరం లో కనిపిస్తాయి. ఈ లక్షణలు ఉంటే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
యువతలో ఫ్యాటీ లివర్ వ్యాధి సర్వసాధారణంగా మారింది. ఫ్యాటీ లివర్ సమస్య గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోకుంటే సిర్రోసిస్‌గా మారే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన మొదటి సంకేతాల్లో అకస్మాత్తుగా లేదా కారణం లేకుండా బరువు పెరగడం ఒకటి. తీవ్రమైన అలసట లేదా బలహీనత అనేది ఫ్యాటీ లివర్ వ్యాధి సంకేతం. శక్తి జీవక్రియలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, కాబట్టి అది సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో శక్తి స్థాయిలు తక్కువగా ఉండవచ్చని తెలిపారు.పొట్ట పైభాగాన కుడివైపు నొప్పి, వాపు ఫ్యాటీ లివర్ వ్యాధిని సూచిస్తుంది. మూత్రం లేదా మలంలో ఏవైనా మార్పులు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయ కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ముదురు రంగు మూత్రం, పాలిపోయిన మలం కాలేయ పనితీరులో లోపానికి సంకేతాలు. షుగర్ టెస్ట్ లో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత ఉన్నట్లు తేలితే, కాలేయ పనితీరును కూడా తనిఖీ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతతో కూడిన అధిక రక్త స్థాయిలు సాధారణంగా కనిపిస్తాయని, ఇది కాలక్రమేణా టైప్ 2 మధుమేహం, మెటబోలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అధిక స్థాయిలో కొవ్వులు ఉంటాయని అధ్యయనంలో పేర్కొంది. దీంతో.. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే లివర్ పరీక్ష చేయించుకోవటం.. వైద్యుడిని సంప్రదించటం అవసరమని నిపుణులు సూచనలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా చేస్తే ఇతరత్రా సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలోనే అప్రమత్తం కావటం ద్వారా ఫ్యాటీ లివర్ ను చికిత్స ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుత యువతలో కదలికలు లేని జీవన శైలి.. గంటల తరబడీ కంప్యూటర్ల ముందు కూర్చోవటం.. వ్యాయామం లేకపోవటం.. జంక్ ఫుడ్స్ ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దీంతో.. ఫ్యాటీ లివర్ లక్షణాలను గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications