నార్మల్ కు భిన్నంగా మసాలా గుడ్డు వేపుడు.. ఇలా చేసి చూడండి!
గుడ్లు మంచి పోషకాలు. ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు తినాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. గుడ్డు వేపుడు, పులుసు, టమాటాలతో ఎగ్ కూర కాకుండా మసాలా మిక్స్‌తో వేపితే అది ఒక రెస్టారెంట్ స్పెషల్‌గా మసాలా గుడ్డు వేపుడు కూరగా మారిపోతుంది.
మసాలా గుడ్డు వేపుడు
మసాలా గుడ్డు వేపుడు ఒక సులభమైన, రుచికరమైన వంటకం. రాత్రి వేళల్లో అన్నం, రోటి, చపాతీతో పాటు లేదా స్టార్టర్‌గా కూడా సూపర్‌గా ఉంటుంది. ఇది చేయడానికి సమయం తక్కువ, కానీ రుచి మాత్రం ఎక్కువ. మరి మసాలా గుడ్డు వేపుడు ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
కోడి గుడ్లు – 4
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
పచ్చి మిర్చి – 3 (కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి – 1 చెంచా
గరంమసాలా – ¾ చెంచా
పసుపు – అరచెంచా
కారం– రుచికి తగినంత
ఉప్పు – రుచికి తగినంత
కరివేపాకు – 2 రెమ్మలు
ఆవాలు – ½ చెంచా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర –కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా గుడ్లను బాగా ఉడికించి, చల్లబరచి, పొట్టు తీసి రెండు లేదా మూడు గాట్లు పెట్టి పక్కన పెట్టండి. ఇలా చేస్తే మసాలా గుడ్లలోకి బాగా చొచ్చుకుపోతుంది. ఆపై స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు జోడించండి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు మధ్యస్థ సెగ మీద వేయించండి.
ఇలా వండితే మసాలా గుడ్డు వేపుడు బాగుంటుంది
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి.ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. ఒక నిమిషం వేగిన తర్వాత ఉడికించిన గుడ్లను ఆ మసాలాలో వేయండి. బాగా గుడ్లకు పట్టేలా కలపండి. సన్నసెగ మీద గుడ్లు మసాలాతో బాగా కలిసేలా మధ్య మధ్యలో తిప్పుతూ 4-5 నిమిషాలు వేయించండి.
సూపర్ రుచితో మసాలా గుడ్డు వేపుడు
గుడ్లు చక్కగా మసాలా పట్టి, కొంచెం క్రిస్పీ అయ్యేలా వేయించండి. చివర్లో తరిగిన కొత్తిమీర చల్లి కలిపి, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే రుచికరమైన మసాలా గుడ్డు వేపుడు సిద్ధం. అయితే గుడ్లను ఎక్కువ సమయం వేయిస్తే గుడ్లు గట్టిపడి అంత రుచిగా ఉండవు. కనుక మసాలా పట్టేవరకు వేయిస్తే చాలు. వేడి వేడిగా అన్నం లేదా రోటితో దీనిని తింటే సూపర్ రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇది నార్మల్ గా స్నాక్ లా కూడా తినొచ్చు.













Click it and Unblock the Notifications