Sabja Vs Chia: ఏవి బెస్ట్ - ఎవరికి ఏది మంచిది..!!
ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే తమ ఆహారంలో చియా గింజలు, సబ్జా గింజలు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను చేర్చుకుంటున్నారు. ఈ రెండు చిన్న గింజలు ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఇవి చూడటానికి ఒకేలా ఉండటంతో చాలామంది వాటిని ఒకటే అనుకుంటారు. కానీ నిజానికి వీటి లక్షణాలు, ఉపయోగాలు వేర్వేరు. కాబట్టి చియా, సబ్జా గింజల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను తెలుసుకోవడం అవసరం.
ఇటీవల కాలంలో ఈ రెండు రకాల విత్తనాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఇటీవల ఎక్కువగా చియా గింజలు, సబ్జా గింజలను ఆహారంలో చేర్చుకుంటు న్నారు. నీటిలో నానబెట్టినప్పుడు రెండూ ఒకేలా కనిపించినప్పటికీ, వీటి ప్రయోజనాలు కొంత భిన్నంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో ఈ రెండు గింజలు వేర్వేరు విధాలుగా పనిచేస్తాయని వివరిస్తున్నారు. అయితే ఇవి నేరుగా కొవ్వును కరిగించవని, సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. చియా గింజల్లో సొల్యూబుల్ ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి నీటిలో నానిన తర్వాత జెల్‌లా మారి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు నియంత్రణలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి.

రెండింటితోనూ ఆరోగ్య పరమైన ప్రయోజనాలు
చియా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా సమతుల ఆహారం, వ్యాయామం తో కలిపి తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. కేవలం చియా గింజల వల్ల మాత్రమే బరువు తగ్గిపోదని స్పష్టం చేస్తున్నారు. సబ్జా గింజలు లేదా బేసిల్ సీడ్స్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి నీటిలో చాలా వేగంగా జెల్ లా మారుతాయి. దీంతో కడుపు నిండిన భావన త్వరగా కలుగుతుంది. ఇది ఎక్కువగా తినే అలవాటును తగ్గించడంలో సహాయపడు తుంది. అలాగే అసిడిటీ, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సబ్జా గింజలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నిపుణులు ఈ రెండింటినీ మారుస్తూ తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ గింజలను ఉపయోగించే విధానం కూడా ముఖ్యమని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు టీస్పూన్ల గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. నిమ్మరసం, స్మూతీలు, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. సబ్జా గింజలు, చియా గింజలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే.













Click it and Unblock the Notifications