మన నోటిలోని బాక్టీరియా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట!
నోటి ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో ఒక సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మనం పళ్లు తోముకోవడం లేదా మౌత్ వాష్‌లు ఉపయోగించడం ద్వారా బాక్టీరియాను 'చంపడం' మాత్రమే మనకు తెలుసు. కానీ, బాక్టీరియాను చంపాల్సిన పనిలేకుండానే, అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోకుండా చేస్తే చాలు.. మన పళ్లు భద్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో జరిగిన ఈ సరికొత్త పరిశోధన వివరాలు ఇప్పుడు దంత వైద్య రంగంలో హాట్ టాపిక్‌గా మారాయి.
మన నోటిలో దాదాపు 700 రకాల బాక్టీరియా జాతులు ఉంటాయి. ఇవన్నీ ఊరికే ఉండవు.. ఒకదానితో ఒకటి రసాయన సంకేతాల ద్వారా నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాయి. దీన్ని శాస్త్రీయంగా 'కోరం సెన్సింగ్' అంటారు. ఇవి ఇలా మాట్లాడుకుంటూ జట్టు కట్టడం వల్లే దంతాలపై 'ప్లాక్' (దంత ఫలకం) ఏర్పడుతుంది. ఈ సంభాషణలకు అడ్డుకట్ట వేస్తే, అవి హానికరమైన ముఠాలుగా ఏర్పడలేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాక్టీరియాను నిర్మూలించడానికి బదులు, వాటి ప్రవర్తనను మార్చడమే ఈ కొత్త టెక్నిక్ ఉద్దేశ్యం.

ఆక్సిజన్‌తో మారుతున్న సిగ్నల్స్
ఈ పరిశోధనలో మరో కీలక విషయం ఏంటంటే.. చిగుళ్ల పైన (ఆక్సిజన్ ఉండే చోట), చిగుళ్ల కింద (ఆక్సిజన్ లేని చోట) బాక్టీరియా వేర్వేరు రకాలుగా మాట్లాడుకుంటాయి. ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నప్పుడు బాక్టీరియా పంపే సంకేతాలను అడ్డుకుంటే, నోటి ఆరోగ్యానికి మేలు చేసే 'మంచి బాక్టీరియా' పెరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. అదే సమయంలో చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే 'రెడ్ కాంప్లెక్స్' బాక్టీరియా సంఖ్య తగ్గుముఖం పట్టింది.
'లాక్టోనేస్' ఎంజైమ్‌తో విరుగుడు
బాక్టీరియా సంభాషణలను ఆపడానికి శాస్త్రవేత్తలు 'లాక్టోనేస్‌లు' (Lactonases) అనే ప్రత్యేక ఎంజైమ్‌లను వాడారు. ఇవి బాక్టీరియా పంపే రసాయన సందేశాలను మధ్యలోనే తుంచేస్తాయి. దీనివల్ల బాక్టీరియా తన వృద్ధిని సమన్వయం చేసుకోలేక, హానికరమైన పొరలుగా ఏర్పడలేవు. ఇది అడవిలో చెట్లు పెరిగే క్రమం లాంటిదని, మొదట వచ్చే మంచి మొక్కలను ఉంచి, తర్వాత వచ్చే కలుపు మొక్కలను (హానికర బాక్టీరియా) రాకుండా చేయడమే ఈ వ్యూహమని ప్రొఫెసర్ మైకేల్ ఎలియాస్ వివరించారు.
యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే..
ప్రస్తుతం చాలా బాక్టీరియాలు యాంటీబయాటిక్స్‌కు లొంగడం లేదు (Antibiotic Resistance). ఇలాంటి సమయంలో వాటిని చంపడానికి ప్రయత్నించకుండా, వాటిని దారికి తెచ్చే ఈ విధానం ప్రజారోగ్యానికి పెద్ద వరమని చెప్పాలి. ఈ టెక్నాలజీ కేవలం నోటికే పరిమితం కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
"బాక్టీరియాపై యుద్ధం ప్రకటించొద్దు.. వాటితో దౌత్యం నడపండి" అనే కొత్త సూత్రంతో ఈ పరిశోధన సాగింది. త్వరలోనే మనం వాడే టూత్‌పేస్ట్‌లు లేదా జెల్స్‌లో ఈ రకమైన ఎంజైమ్‌లు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే, దంతాల పసుపు రంగు (ప్లాక్) సమస్య మరియు చిగుళ్ల వ్యాధులకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే!














Click it and Unblock the Notifications