Tirumala: తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కొబ్బరి పచ్చడి-రెసిపీ ఇదిగో..!!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటే ప్రపంచ నలుమూలల ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక ఎమోషన్. స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామి పిలుపు రావడమే ఆలస్యం.. ఎన్ని కష్టాలకు ఓర్చుకుని అయినా సరే తిరుమలేశుని దివ్యదర్శనం చేసుకునే వెళతారు భక్తులు. అంతేకాదు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే కూడా ఒక ఎమోషన్.ఇక స్వామివారి దర్శనానంతరం అక్కడే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ఆలయంలో భక్తులు భోజనం చేస్తారు. ఆ భోజనం ఎంతో శుచితో కూడిన రుచిగా ఉంటుంది. ఇందుకోసం టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజూ కొన్ని లక్షల మంది భక్తుల కడుపు నింపుతుంది.ఆ భోజనంలో భాగంగా కొబ్బరి పచ్చడి వడ్డిస్తారు. ఆ పచ్చడి నుంచి వచ్చే సువాసనకు నోట్లో నీళ్లూరుతాయి.. అంత రుచిగా ఉంటుంది.
కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు
తిరుమలకు వెళ్లినప్పుడే లభించే ఆ పచ్చడి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి.అయితే ఆ పచ్చడి ఎలా తయారు చేస్తారు అందులో వాడే పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం .ఇంట్లో చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. నాలుగు రోజుల పాటు నిల్వ కూడా చేయొచ్చు.

ఇందుకోసం కావాల్సిన పదార్థాలు:
- పచ్చి కొబ్బరికాయ
- వంట నూనే
- పచ్చి శనగపప్పు (2 టీస్పూన్లు)
- కారంతో కూడిన ఎండుమిర్చి (15-18)
- కొంచెం నానబెట్టిన చింతపండు
- రుచికి సరిపడా ఉప్పు
- చిటికెడు పసుపు
- అవసరం మేరకు నీళ్లు
- అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర,ఇంగువ,కరివేపాకు (తాళింపు)
తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరికాయను పగలగొట్టి అందులో ఉన్న కొబ్బరిని తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఓ బాణలిలో నూనెపోసి అది బాగా మరిగిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలను అందులో వేసి బంగారం రంగులోకి మారే వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.అలా వేగాక తీసి పక్కనబెట్టుకుని చల్లారనివ్వాలి. కొబ్బరి ముక్కలు చల్లారేలోగా...అదే వేడి నూనెలో 2 టీస్పూన్లు పచ్చి శనగపప్పును వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి తీసుకుని అవి నల్లబడేవరకు అదే నూనెలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. పచ్చడి ఎక్కువ కావాలి,నిల్వ ఉంచుకోవాలంటే కాస్త ఎండుమిర్చి ఎక్కువగానే తీసుకోండి.
ఇక వేపుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చిలను ఒక మిక్సీ జార్‌లో వేయండి. అందులోనే నానబెట్టిన చింతపండు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయండి.కొంచెం పసుపు వేసుకుని అవసరం మేరకు నీళ్లు కలపండి. ఇక పచ్చడి కచ్చ పచ్చాగా వచ్చేలా మిక్సీ కొట్టండి. తర్వాత బాణలిలో రెండు టీస్పూన్ల నూనెను వేడి చేసి అందులో అర టీస్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంగువా, కరివేపాకు వేసి వేపండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీలో పట్టిన పచ్చడి మిశ్రమాన్ని కలపండి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది. అచ్చం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ఆలయంలో వడ్డించే పచ్చడి టేస్టే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ఈ అతి తక్కువ పదార్థాలతో కొబ్బరి పచ్చడి ట్రై చేయండి.













Click it and Unblock the Notifications