టమాటాలతో అప్పటికప్పుడు చేసే నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
రోజువారి భోజనంలో కూరలే కాదు, పచ్చళ్ళు కూడా మన జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి. రకరకాల కూరలు, పచ్చళ్ళు చేసుకొని కడుపునిండా భోజనం చేయాలి అని భావించేవాళ్ళు కొత్త కొత్త రకాల వంటకాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కొత్త వంటకాలు మాత్రమే కాదు, పాత వంటకమే అయిన ఎప్పటికి ప్రత్యేకస్థానం సంతరించుకునే వంటకాలు కూడా ఉంటాయి.అటువంటి వాటిల్లో అప్పటికప్పుడు చేసే టమాటా నిల్వ పచ్చడి ఒక ప్రత్యేక స్థానం.
మూడు నెలలు నిల్వ ఉండే టమాటా పచ్చడి
టమాటా నిల్వ పచ్చడి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. కూర చేసిన అంత సులభంగా తయారు చేసుకునే టమాటా పచ్చడి మూడు నెలలపాటు ఘుమఘుమలాడుతుంది. దీనిని ఫ్రిజ్లో నిల్వ చేసినట్లయితే ఆరు నెలల కాలమైనా నిల్వ ఉంటుంది. దీని రుచి కారణంగా అరకేజీ పచ్చడి పది రోజుల్లోనే అయిపోతుంది అంటే నమ్మి తీరాల్సిందే. మరి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే టమాటా నిల్వ పచ్చడి తయారీ తెలుసుకుందాం.

తయారీకి కావాల్సిన పదార్ధాలు
పండు టమాటాలు - అరకేజీ
చింతపండు - 60 గ్రాములు
కారం - 50 గ్రాములు
పసుపు - ఒక టీ స్పూన్
నూనె - 200 గ్రాములు
మెంతులు - 2 టీ స్పూన్లు
ఆవాలు - 2 టీ స్పూన్
మినప్పప్పు - 1 స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
వెల్లుల్లి - 12 రెబ్బలు
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండు మిర్చి - 5
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, 2 టీ స్పూన్ల మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి సన్నటి మంటపై వేయించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అర కేజీ టమోటాలను కడిగి, తడి లేకుండా తుడిచి, తొడిమలు తీసి ముక్కలుగా చేయాలి. 60 గ్రాముల చింతపండును గింజలు లేకుండా సిద్ధం చేయండి. టమోటా, చింతపండును మిక్సీలో వేసి రెండు సార్లు పల్స్ ఇవ్వాలి.
పచ్చడి ఇలా చేస్తేనే బెస్ట్
అందులో 50 గ్రాముల కారం, ఉప్పు, 50 గ్రాములు, 12 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో పావుకిలో పల్లీ నూనె వేడి చెయ్యాలి. అందులో ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు దోరగా వేయించి, అందులో రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడి వేసి తక్కువ మంటలో మధ్యస్తంగా ఉంచి, బాగా కలుపుతూ ఉడికించాలి.
పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలంటే ఇలా చెయ్యాలి
బాగా పచ్చడి ఉడికితేనే అది ఎక్కువ నిల్వ ఉంటుంది. దాదాపు 15 నిముషాల తర్వాత పచ్చడి నూనెను పీల్చుకుని తిరిగి వదులుతుంది. మరో 5 నిమిషాలు ఉడికించి, ముందుగా చేసిన ఆవాలు-మెంతుల పొడిని వేసి బాగా కలపండి. ఇంకో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిన తర్వాత పచ్చడిని పూర్తిగా చల్లారనిచ్చి, మరుసటి రోజు శుభ్రమైన గాజు సీసాలో వేసుకోవాలి. ఈ పద్ధతిలో చేసిన టమాటా పచ్చడి దాదాపు మూడు నెలలకు పైగా తాజాగా నిల్వ ఉంటుంది.












Click it and Unblock the Notifications