పల్లె దవాఖానాల్లో 1492 మంది వైద్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్: త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వైద్యారోగ్య శాఖలోనూ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పల్లె దవాఖానాల్లో పలు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.
ప్రాథమిక వైద్యం అందించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఈ పల్లె దవాఖానాల్లో 1492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.

తెలంగాణలో 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా వైద్యారోగ్య శాఖ మార్చుతోంది. అయితే, ఇప్పటికే ఈ సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రోగికి అవసరమైన మందులను అందజేస్తున్నారు. ఇప్పుడు వీటిని పల్లె దవాఖానాలుగా మార్చుతూ.. వాటిలో 1492 మంది వైద్యలును నియమిస్తుండటంతో మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో కూడా అందనున్నాయి.
పల్లె దవాఖానాల్లో వ్యాధి నిర్థరణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని టీ డయాగ్నస్టిక్స్ కు పంపుతారు. అక్కడి నుంచి వచ్చిన వ్యాధి నిర్థరణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాధమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకుంటారు. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్ సీ లేదా ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. దీంతో చిన్న చిన్న వ్యాధులకే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉండదు.