నేడు పాశాంకుశ ఏకాదశి.. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి!!
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అంటారు. ఈ పాశాంకుశ ఏకాదశి చాలా మహిమ కలిగినటువంటి ఏకాదశి. ఈరోజు పాశాంకుశ ఏకాదశి. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో అనేక పుణ్య పలితాలు లభిస్తాయని చెబుతారు. ఏకాదశి తిధి శుక్ల పక్షంలోని 11వ రోజున వచ్చే హిందూ ఉపవాస దినమని చెప్తారు.
పాశాంకుశ ఏకాదశిని పద్మనాభ స్వామికి అంకితం చేశారు. ఈరోజు భక్తులు పూర్తి అంకితభావంతో, ఉత్సాహంతో పద్మనాభుని పూజిస్తారు పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే శ్రీమహావిష్ణువుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి అకాల మృత్యువు తొలగిపోతుందని, శారీరక బాధలు నయమవుతాయని, వ్యాధుల నుంచి బయటపడతారు అని చెబుతున్నారు.

పాశాంకుశ ఏకాదశి నియమాలను సంతానం పాటిస్తే తల్లిదండ్రుల ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతుందని నమ్ముతారు. పాశాంకుశ ఏకాదశి నాడు తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీనారాయణులను, తులసి తో పూజించాలి. ధూపం, దీపం నివేదించి, నైవేద్యంగా ఆవుపాలతో చేసిన పదార్థాలను పెట్టాలి. ఈరోజు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయలేనివారు పాలు, పండ్లు తీసుకోవచ్చు కానీ అన్నం మాత్రం తినకూడదు.
ఈరోజు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తి గుడికి వెళ్లడం, గో సేవ చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు. ఈరోజు ఉపవాసం పాటించేవారు పగలు, రాత్రి అస్సలు నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్తుతిస్తూ గడపాలి. ఇక పాశాంకుశ ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం వలన చాలా పుణ్యం వస్తుందని చెబుతున్నారు. పాపాలు తొలగించడానికి అత్యంత పవిత్రమైన ఆచారంగా పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
పాశాంకుశ ఏకాదశి నాడు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించే వారికి మోక్షం లభిస్తుందని అంటున్నారు.పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని అన్ని వయసుల వారు పాటించవచ్చు.ఈ రోజు విష్ణు మూర్తిని స్మరించిన వారు హిందూ పుణ్య క్షేత్రాలను సందర్శించినంత పుణ్యాన్ని మూట గట్టుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications