వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ రామానుజాచార్యుల జయంతి:తిరుపతితో ఆయనకున్న సంబంధమేంటి..?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రామానుజాచార్యుల కాలం ( క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస్తిక హేతువాది , యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు.
కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ సాటిలేని భక్తికీ రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.

జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు :- ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం శాలివాహన శకం ప్రకారం 1005 వ సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, మిధునరాశి, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి , తండ్రి కేశవాచార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్ద కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి.

Ramanujacharya Birth Anniversary: Know the history of this great saint

గురువుతోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరు మంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు.

పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి అందరికీ ముక్తి కలుగుతుంది గదా! అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం , వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం , శ్రీరంగ గద్యం , వైకుంఠ గద్యం , శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ , అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.

తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ద్రావిడ , సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై , వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన భార్గవ పురాణం గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం వ్యాసంలో వ్రాశారు. ( విశిష్టాద్వైతం వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు )

నామకరణం :- శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి ( శ్రీశైలపూర్ణుడు ) ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి నమ్మాళ్వార్ తన 'తిరువోయ్మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి , గురువు ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.

ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన ( సాధించిన ) ముఖ్య ఉద్దేశ్యాలు :- మొదటిది ప్రబలంగా కొనసాగుతున్న బౌధ్ధo,అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం. రెండవది ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లోసుగులను సరిదిద్ది విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం. ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-

ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో , మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

దేవుడిని పూజించటం , మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో , తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు , తమకు కీడు జరిగినా , పదిమందికి జరిగే మేలుకై , తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన , పంచ సంస్కార కర్మ , నాలాయిర దివ్య ప్రబంధ బోధన , శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం , అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం. వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం. భాగవత , విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస , పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి , వారికా నామధేయాలను ప్రసాదించి , వ్యాస , పరాశరులకు నివాళులు అర్పించటం. ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి , అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.

తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు :-

తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని , శక్తి విగ్రహమో , శివ ప్రతిమో , సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది.
తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు.

పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో , శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను , శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ , రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు , శైవాయుధాలు , శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.

అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి , వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను , పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో , మూర్తి స్వరూపనిర్ధారణలో ఆగమ పద్ధతుల్లో తిరుమల - తిరుపతిపైన చెరగని ముద్ర. శ్రీమతే రామానుజాయ నమః , శ్రీమతే నారాయణాయ నమః

English summary
Sri Ramanujacharya is one of the greatest Philosophers who fought for the poor people in the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X