ఎన్టీఆర్ జయంతి వేళ.. ప్రధాని మోదీ ట్వీట్
నేడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోన్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ జరుగనుంది.
ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటుడు, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. తాతయ్యను స్మరించుకున్నారు. ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి, జనవరి 18వ తేదీన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఘాట్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు. పేదలు, అణగారిన వర్గాల గౌరవం కోసం ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఎన్టీఆర్ నిబద్ధతను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల నిబద్ధత చూపిన నేతగా అభివర్ణించారు.
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain…
— Narendra Modi (@narendramodi) May 28, 2026
ఎన్టీఆర్ జీవితం, ఆయన అనుసరించిన ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ సినీరంగంలో చేసిన గొప్ప సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని ప్రధాని అన్నారు. ఏపీలో తన మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications