రేపే రథసప్తమి.. ఇలా చేయండి.. ఐశ్వర్యం మీ సొంతం
మనకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంత్రం విష్ణుస్వరూపంగా పూజలందుకుంటాడు. అంతటి తేజోమూర్తి మాఘ సప్తమినాడు జన్మించడంవల్ల ఆరోజును సూర్య జయంతిగా జరుపుకుంటాం. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయనం రెండు విధాలుగా ఉంటుంది. ఆషాఢం నుంచి పుష్య మాసం వరకు దక్షిణాయనం కాగా, మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం ప్రారంభ సూచకంగా రథ సప్తమి అనే పేరు వచ్చింది. తిథుల్లో ఏడో తిథైన మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుతారు.
రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే 'సప్త సప్త మహాసప్త.. సప్త ద్విపా వసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హన్తి సప్తమి' అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. ఆ సమయంలో శరీరం మీద ఏడు జిల్లేడు ఆకులు లేదంటే ఏడు చిక్కుడు ఆకులు ఉంచాలి. వాటిమీద రేగిపండ్లను పెట్టి తల స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం ఉంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జిల్లేడు, చిక్కుడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు చలికాలంలో ఏర్పడే చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నీటిలో ఉండే ఔషధ గుణాలు రుతువుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరం సిద్ధపడేలా చూస్తాయి. స్నానం తర్వాత దేవతలకు అర్ఘ్యాన్ని వదలాలి. ఆవుపాలతో పాయసం చేసి చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నివేదనగా పెట్టాలి. ఆరోజు చేసే స్నానంతోపాటు వ్రతాలు, పూజలు, తర్పణాలు, దానాలు మిగతా సమయంలో చేసేవాటికంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియక చేసిన పాపాలవల్ల రోగం, శోకంలాంటి కర్మలన్నీ పటాపంచలవుతాయి.












Click it and Unblock the Notifications