రైతుల మాసం శ్రావణ మాసం అని ఎందుకు పిలుస్తారు..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వర్షఋతువు రాకతో వచ్చే పవిత్రమైన మాసం శ్రావణం. ఈ ఋతురాగం వర్షాలతో పాటు శ్రావణంతో ఇంటింటా హర్షాతిరేకాలను తీసుకువస్తుంది. శ్రావణ ఘడియలు మొదలవ్వడంతోనే.. సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రతి లోగిలి ముగ్గులతో మురిసిపోతుంటుంది. ప్రతి గడపా పసుపుతో తళతళమెరుస్తుంది. ప్రతి ద్వారమూ తోరణాలతో.. పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. శ్రావణం రాకతోనే పండుగల వెల్లువ మొదలవుతుంది.

శ్రావణ మాసం రైతుల మాసం. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటాయి. గ్రామాల్లో పొలం పనులు వేగం పుంజుకుంటాయి. పొలం గట్ల వెంబడి, బావుల దగ్గర కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో కీటకాలు, సర్పాల సంచారం కూడా పెరుగుతుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మగవారికి క్రిమికీటకాదుల నుంచి ఏ ప్రమాదం రాకూడదని కోరుతూ.. ఆడవాళ్లు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. తమ మాంగల్యం బలంగా ఉండాలని కాంక్షించి శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు.

Sravana masam starts with the rainy season.This is an auspicious season.

తమ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. నోము పూర్తయిన తర్వాత ముత్తయిదువులకు తాంబూలం ఇచ్చి.. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. హరిహరులకూ ప్రీతిపాత్రమే.. శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాలే కాదు.. సోమవారాలు, శనివారాలు కూడా ప్రత్యేకమైనవే! సోమవారాలు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. శనివారాలు వేంకటేశ్వరస్వామిని పూజిస్తారు. శ్రీనివాసుడు శ్రవణం నక్షత్రంలో అవతరించిన సందర్భంగా శ్రావణంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సోమవారం, శనివారాలు ఉపవాసాలు ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే శ్రావణంలో నాలుగేసి చొప్పున వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు వేటికవే ప్రత్యేకమైనవి. స్వాహా దేవికి హోమం..శ్రావణ మాసంలో ప్రతి రోజూ పర్వదినమే! శ్రావణ శుద్ధ పాడ్యమి అగస్త్య మహాముని జన్మదినం.

విదియ రోజు అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు భార్యాభర్తలిద్దరూ హోమం చేస్తారు. పంచమి రోజు నాగులపంచమిగా ప్రసిద్ధి. శ్రావణ శుద్ధ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమని కూడా అంటారు.

ఆ నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. రక్షా బంధనం (రాఖీ పండుగ) దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతుంది. ఇదే రోజు విష్ణుమూర్తి హయగ్రీవుడిగా అవతరించాడు కనుక.. 'హయగ్రీవ ఉపాసన' చేస్తారు.

శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన శ్రావణ బహుళ అష్టమి 'జన్మాష్టమి'గా, 'కృష్ణాష్టమి'గా జరుపుకుంటారు. శ్రావణ బహుళ అమావాస్య 'పొలాల అమావాస్య'గా ప్రసిద్ధి. గ్రామాల్లో రైతులు.. పశువులను అలంకరించి, పూజిస్తారు.

ఇలా ఎన్నో పండుగల సమాహారం శ్రావణ మాసం. వేదాధ్యయన కాలం వేద వాఙ్మయం శ్రావణ మాసంలోనే పుట్టిందంటారు. హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే.. విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు.

హయగ్రీవుడు అవతరించింది శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడే! అందుకే వేదాధ్యయనానికి, జ్ఞాన సముపార్జనకు శ్రావణ మాసం అనుకూలమైనదని చెబుతారు. శ్రవణం వల్ల నేర్చుకోవలసింది వేదం. కొత్తగా ఉపనయనం అయిన వారికి జంధ్యాల పౌర్ణమి రోజు మౌంజీ బంధనం తొలిగిస్తారు.

ఆ మరుసటి రోజు నుంచి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. మగవాళ్ల మాసం కూడా.. శ్రావణ మాసం అనగానే... ఆడవాళ్ల మాసం అనే అపోహ ఉంది. ''పురుషానాం అయం మాసః శ్రావణం పరికీర్తితః' అని పురాణోక్తి.

అంటే పురుషులకూ ఈ మాసం ప్రత్యేకమైనదే! శ్రావణం చాతుర్మాసాల్లో ఒకటి. బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థాశ్రమంలో ఉన్నవారు, సన్యాసులు ప్రత్యేక వ్రతాలు చేసే కాలమిది. శ్రావణంలో ముప్ఫయ్‌ వ్రతాలు ఆచరించాలని స్కాంద పురాణ అంతర్గతమైన 'శ్రావణ మాస వైభవం'లో తెలియజేశారు.

మౌనవ్రతం, లవణ వ్రతం, దదీ వ్రతం లాంటి వ్రతాలు చేస్తుంటారు.. ప్రతి వ్రతంలోనూ మనిషి జీవన ప్రమాణాలనూ, ఆయురారోగ్యాలనూ పెంచే శాస్త్రీయత ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకుందాం. దేవుడికీ వ్రతం.. కామ్యార్థ సిద్ధికి మనుషులు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.

శ్రావణంలో దేవుడి కోసం చేసే వ్రతం కూడా ఉంది. దానిని పవిత్రోత్సవం అంటారు. రంగు రంగుల దారాలతో దండలు చేసి.. వాటిని పాలలోనో, తేనెలోనో, నీటిలోనో రెండు రోజుల పాటు ఉంచుతారు.

దీనిని అధివాసం అంటారు. శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడు రోజుల్లో ఒకనాడు ఆ దారపు దండలను ఆలయాల్లోని దేవతామూర్తికి అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల.. ఆ ఏడాదిలో అర్చకులు, ధర్మాధికారులు, భక్తుల ద్వారా తెలియక జరిగిన అపచారాలు నివృత్తి అవుతాయని ఆగమశాస్త్రం చెబుతోంది.

శ్రావణ శుద్ధ దశమి రోజు శివలింగాన్ని పాలతో అభిషేకిస్తే.. ధనహాని ఉండదని శాస్త్రం చెబుతోంది. శుద్ధ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుడిని పంచామృతంతో అభిషేకిస్తే.. దీర్ఘాయుష్షు కలుగుతుందని పెద్దల మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+