నేడే నాగుల చవితి.. పూజ విశిష్టత; నాగదేవతను పూజిస్తే కలిగే విశేష ఫలితాలు ఇవే!!
నేడే నాగులచవితి. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నాగ దేవతను పూజించే రోజు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 28వ తేదీన శుక్రవారం అంటే నేడు వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. ఇక అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాలకు చవితి ముగుస్తుంది .ఇక నేడు శుభసమయం విషయానికి వస్తే మధ్యాహ్నం 2.03 నిమిషాల నుంచి 03:43 వరకు శుభ సమయం ఉంటుంది.

నాగుల చవితి నాడు పూజలు.. ఫలితాలివే
ఇక నాగులచవితి రోజున నాగ దేవత ని పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా కుజ దోషము, కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగులచవితి రోజున, కాలసర్ప దోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ఇక నాగుల చవితి పండుగ రోజున మహిళలు విశేషంగా పుట్టలో పాలు పోసి, ఉపవాస దీక్షను ఆచరిస్తారు. నాగల చవితి పండుగ రోజున అందరూ తమ కుటుంబం సంతోషంగా ఉండాలని, శ్రేయస్సుతో ఉండాలని భావించి నాగ దేవతకు పూజాదికాలు నిర్వహిస్తారు.

సర్వ రోగాలు, సమస్త దోషాల నివారణకు నాగుల చవితి పూజలు
నాగల చవితి పండుగ రోజున నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు. అంతేకాదు నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగల చవితి పండుగ రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకి గా, శ్రీ మహా విష్ణువు కి ఆదిశేషునిగా మారి తోడుగా ఉంటాడని నమ్ముతారు.అందుకే ఈ రోజున నాగేంద్రుడిని పూజించడం అంటే అటు శివుడికి, ఇటు విష్ణువుకు పూజ చేసినంత ఫలితం ఉంటుందని చెబుతారు.

నాగదోషం ఉన్నవారికి నాగారాధనతో మంచి ఫలితం
ఇక నాగదోషం ఉన్నవారు నాగారాధన చేసినట్లయితే రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెబుతారు. నాగుల చవితి రోజు నాగ దేవతకు పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. పండుగనాడు నాగదేవతను పూజించి చలిమిడి ,వడపప్పు, చిమ్మిలి నైవేద్యంగా పెట్టడం వల్ల నాగదేవత కటాక్షం ఉంటుందని చెబుతారు. ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి నాగ దేవతకు పూజలు చేసినట్లయితే సర్వరోగాలు, వివాహ దాంపత్య దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నాగుల చవితి పూజ చేస్తే కోరుకున్నవన్నీ నెరవేరతాయని నమ్మకం
ఈ పండుగ నాడు నాగ దేవతను పూజిస్తే గర్భ దోషాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారతారని కూడా నమ్ముతారు. ఇక నేడు నాగదేవతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి మనసులో ఏదైనా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుంది అని మహిళలు బలంగా నమ్ముతారు కాబట్టే నాగుల చవితి పండుగ నాడు ఆలయాల బాట పట్టి పూజలు నిర్వహిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications