• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Varalakshmi Vratham2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా? లక్ష్మీపూజ ప్రాశస్త్యం; పూజావిధానం తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

శ్రావణ మాసంలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం అత్యంత ముఖ్యమైంది. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఈ మాసంలో ప్రతీ ఇంట్లో మహిళలు మహాలక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు. పూజలు, ఉపవాసాలతో వరలక్ష్మీ దేవిని విశేషంగా పూజిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పనలవికాదు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ఎవరికి వారు వారి శక్తి కొలది అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి, వ్రతాన్ని ఆచరించి ఈ నోమును నోచుకుంటారు. వరలక్ష్మీదేవి అష్టైశ్వర్య, భోగ భాగ్యాలను, సకల శుభాలను, ఆయురారోగ్యాలను ఇస్తుందని మహిళలు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.

Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చెయ్యకండిVaralakshmi Vratham 2022: వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చెయ్యకండి

 వరలక్ష్మీ వ్రతం రోజు ఏం చెయ్యాలంటే

వరలక్ష్మీ వ్రతం రోజు ఏం చెయ్యాలంటే

మహిళలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారో తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి, అభ్యంగన స్నానమాచరించి, ఇంటి ముందు ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి, వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టి, గడపలను పసుపు, కుంకుమలతో పూజించి, గుమ్మాలను మంగళ తోరణాలతో అలంకరించి ఇల్లంతా పూజకు సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ మండపాన్ని మామిడి తోరణాలతో, అరటి పిలకలు, పువ్వులతో అలంకరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేసుకుంటారు.

 మడపం ఏర్పాటు, కలశ స్థాపన విధానం ఇలా ..

మడపం ఏర్పాటు, కలశ స్థాపన విధానం ఇలా ..


వరలక్ష్మీ వ్రతాన్ని చేసే మహిళలు ముందుగా మండపానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. మండపంలో బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది అందులో కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్కతో అలంకరించాలి. ఇక అమ్మవారి ముఖాన్ని కలశంపైన అందంగా అమర్చుకోవాలి. పసుపుతోనైనా, బియ్యంపిండి, మైదా పిండితో గానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోనూ అమ్మవారి విగ్రహాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని అయినా మండపంలో ప్రతిష్టించి పూజించవచ్చు.

లక్ష్మీ పూజకు వాడే పువ్వులు ఇవే

లక్ష్మీ పూజకు వాడే పువ్వులు ఇవే


వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడంలో పూలకు ముఖ్యమైన స్థానం ఉంటుంది. అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అనుకునే మహిళలు బంతి, చేమంతి, గులాబీ, మల్లెలు, సంపెంగలు, మొగలి పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులను తెచ్చి అమ్మవారి పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఇల్లంతా కూడా చాలా మండి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూలతో అలంకరించి వరలక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతారు.

 వరలక్ష్మీవ్రతం నాడు అమ్మవారికి నివేదనగా తొమ్మిది రకాల నైవేద్యాలు

వరలక్ష్మీవ్రతం నాడు అమ్మవారికి నివేదనగా తొమ్మిది రకాల నైవేద్యాలు


వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తొమ్మిది రకాల పిండివంటలు చేయాలని చెప్తుంటారు. ముఖ్యంగా చాలా మంది అమ్మవారికి గారెలు, బూరెలు, పూర్ణాలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు నైవేద్యంగా నివేదిస్తారు. తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకుచేతనైన రకాలు నైవేద్యంగా చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తారు .అయితే అత్యంత భక్తి భావనతో అమ్మవారిని పూజించడమే ప్రధానమని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

వరలక్ష్మీ అమ్మవారి పూజా విధానం

వరలక్ష్మీ అమ్మవారి పూజా విధానం


వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించటానికి ముందు వరలక్ష్మీ దేవిని చక్కగా పువ్వులు, ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి. వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శత నామాలతో అర్చన చేయాలి.అమ్మవారి పూజలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి. అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలను సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి.

 వరలక్ష్మీ వ్రత కథ ఇదే ... వ్రతం చేస్తే కలిగే ఫలితాలు ఇవే

వరలక్ష్మీ వ్రత కథ ఇదే ... వ్రతం చేస్తే కలిగే ఫలితాలు ఇవే


ఇక వరలక్ష్మి వ్రత కథ విషయానికి వస్తే పూర్వం మగధ దేశంలో కౌండిన్యమనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి ఉండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయవిధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవనం సాగించేది. ఆమె వినయవిధేయతలకు మెచ్చి మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో కనిపించి ఆమెకు వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించమని చెప్పింది. సకల సౌభాగ్యాలు చేకూరుతాయని చెప్పింది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొందుతుంది. అప్పటి నుండి ముత్తయిదువులు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటం మొదలుపెట్టారు.

 ముత్తయిదువుల ఆశీర్వాదంతో వరలక్ష్మీ వ్రతం ముగింపు

ముత్తయిదువుల ఆశీర్వాదంతో వరలక్ష్మీ వ్రతం ముగింపు


ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ పెట్టి వారికి పండు,తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపుకుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

English summary
Varalakshmi Vratham is observed on the Friday preceding the full moon of Shravana masam. Let us know What is the significance of Varalakshmi vratham and what is the pooja procedure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X