వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాలయ పక్షం: ఇది ఎలా వచ్చింది, ఏం చేయాలి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మహాలయ పక్షాలు
సెప్టెంబర్ 25 మంగళవారం ఈ నెల భాద్రపద బహుళ పాడ్యమి నుండి అక్టోబర్ 9 మంగళవారం అమావాస్య వరకు మహాలయ పక్షము''అంటారు.ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. ఈ 15 రోజులు ప్రతి రోజు పితృ దేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను నిర్వహించాలి. అలా కుదరని పక్షమున పితృ దేవతలు ఏ తిధిలో మరణిస్తే ఆ రోజు నిర్వహించాలి.

ఈ పక్షములో పితరులు అన్నాన్ని ప్రతి రోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృ తర్పణములు యధావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృ దేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు.తమ వంశాభివృద్ధిని గావిస్తారు.వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, ధర్మసింధూ,నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.

భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవ పదము, కృష్ణ పక్షం పితృ పదము, అదే మహాలయ పక్షము.

మహాలయమంటే-
మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృ దేవతలకిది గొప్ప ఆలయము, పితృ దేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృ దేవతలు తృప్తిని పొందుట అని అర్థములు.

అమావాస్య అంతరార్థం ' 'అమా' అంటే ''దానితో పాటు'', 'వాస్య' అంటే వహించటం. చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితోపాటు కలిసి ఉండే రోజు కాబట్టి 'అమావాస్య' అన్నారు.

సూర్యుడు స్వయం చైతన్యవంతుడు.చంద్రుడు జీవుడే.మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య. చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.

What is Pitru Paksha or Mahalaya Paksha?

మత్స్యపురాణగాథ:- పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు.వారి మానవ పుత్రిక ''అబ్బోద''. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృ దేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. ఆమె వారిలో ''మావసు'' డను పితరుని కామ పరవశంతో వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది. దేవత్వంపోయి భూమి మీద కొచ్చింది.మావసుడు అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ''మావస్య'' అనగా ప్రియురాలు అధీనురాలు కాలేక పోయింది. కనుక ''మావస్య'' కాని ఆమె ''అమావస్య'' లేక ''అమావాస్య'' అయింది.

తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద పితరులకు ప్రీతిపాత్రమయింది. అందువలన పితృ దేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు పితులకు అర్పించిన తర్పణాది క్రియలు అనంత ఫలప్రదము, ముఖ్యంగా సంతానమునకు క్షేమము అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది. జననీ జనకులను ప్రేమానురాగాలను అందించి మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి పితృ తర్పణాదులనిస్తే వారి ఋణం తీర్చుకున్న వాళ్లవుతారని పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య.

తండ్రి జీవించి,తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీ,తండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య అనగా అక్టోబర్ 9 రోజునాడైన చేయాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారి పోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది''అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

English summary
Pitru Paksha, also spelt as Pitri paksha, Pitr Paksha is a 16 lunar day period in Hindu calendar when Hindus pay homage to their ancestor, especially through food offerings. The period is also known as Pitru Pakshya, Pitri Pokkho, Sola Shraddha, Kanagat, Jitiya, Mahalaya Paksha and Apara paksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X