Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే సూతకం ఎవరు ఎలా పాటించాలి

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

'' జాయతే సమానే వంశే '' ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు ( పాలోల్లు ). వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజులు అశౌచం ( మైల ) పాటించడం సంప్రదాయంగా వస్తున్నది. వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు జాతాశౌచం ( పురుడు ) మైల అంటారు. మరణిస్తే మృతాశౌచం ( సూతకం ) పాటించాలి. అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సూతకాన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది.

మరణించిన వ్యక్తికి సంతాపం తెలియజేసే ఉద్దేశంతో పదిరోజులు అశౌచం పాటించడం ధర్మంగా చెబుతారు. దీనిని ఆచరించడం వెనుక ఒక శాస్త్రీయ దృక్పథమూ ఉంది. పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో గానీ, ఒక గ్రామంలో గానీ నివసించే వారు. తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివదేహాన్ని చూసేందుకు వచ్చేవారు. మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే మృతదేహాన్ని చుట్టుకొని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది.

What is the procedure to be followed when someone passes away according to Hindu culture

సూతకం పాటించకపోతే వాళ్ల నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ అనర్థాన్ని అరికట్టడం కోసమే దాయాదులందరూ పదిరోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేసారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పాటిస్తున్న కరోనా క్వారంటైన్‌ లాంటిదే ఇదీ, మృతుని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం, సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది.

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి ఉత్తమగతులు పొందడానికి సంబంధించిన కర్మలు చేయాలి. పరమేశ్వరుడు జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు విధివిధానంగా ఉత్తర కర్మలు ఆచరిస్తూ ఉంటే జీవికి ఆనంద భావం కలిగితే కొడుకు రూపంలో మళ్ళీ అదే కుటుంబలో పుడతాడు అని శాస్త్రం చెప్తుంది.

ఏటి సూతకంలో చేయకూడనివి:- నోములు, వ్రతాలు, దీక్షలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. పుట్టినరోజులు చేసుకోకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. నియమం తప్పకుండా తల్లికి, తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించాలి. వారి పేరుమీద పేదవారికి, పశుపక్ష్యాదులకు తినే ఆహార పదార్ధాలు దానం చేయడం ఉత్తమమైన పని. దీనినే ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో ఉండగా ద్వాదశ దిన కర్మ తర్వాత ఇంట్లో నిత్యపూజ నిర్వహిస్తూ ఉండాలి.

పాలివారికి సూతకం అనేది ఎన్ని తరాల వరకు ఉంటుంది:- ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్ర ప్రకారం 11 రోజుల వరకు సూతకం ఉంటుంది. ఒకే ఇంటి పేరు కలవారికి ఏడు తరాల తరువాత సూతకం అనేది వర్తించదు. మనిషి చనిపోయిన ఏడాది వరకు కుటుంబ సంబంధీకులు పూజలు, వ్రతాలు, శుభకార్యాలు, దేవుడి మొక్కులు తీర్చుకోకుండా ఉండటాన్ని ' ఏటి సూతకం ' అంటారు. దీన్ని సంతానం పాటిస్తారు. ఏటి సూతకం సమయంలో మగపిల్లల పెళ్లిళ్లు, ఉపనయనాలు, నిశ్చితార్థం వంటివి నిషిద్ధం. అయితే ఆడపిల్లల వివాహాలు చేయొచ్చు. ఏడాది లోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది.

మనిషి చనిపోయిన11 రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా, ఇంటి పేరు ఉన్న వారికీ సూతకం ఉంటుంది. ఏడు తరాల విషయానికి వస్తే, ఒకే ఇంటి పేరు ఉన్నవారి మధ్య 12 సంవత్సరాలు రాకపోకలు లేకపోయినా, 12 ఏళ్ల పాటు ఒకరి ఇంట్లో ఒకరు భోజనం చేయకపోయినా సూతకం రద్దు అవుతుంది. ఒకే ఇంటిపేరు కలవారు ఏడు తరాల తరువాత ఎలాంటి మంత్ర ప్రక్రియను ఆచరించకుండానే జ్ఞాతుల ( పాలోల్లు ) మధ్య సూతకం రద్దు అవుతుంది.

ధర్మ సందేహ నివృత్తి :-

* కుటుంబంలో తల్లి, తండ్రి చనిపోతే ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఒక సంవత్సరం పాటు పండగలు, ఏలాంటి శుభకార్యాలు మొదలైనవి చేయకూడదు.

* పాలోళ్లకు కేవలం 11 రోజుల వరకు మాత్రమే సూతకం వర్తిస్తుంది . 12 రోజు నుండి వారి ఇళ్ళలో పండగలు, శుభకార్యాలు, ఇతర అన్ని ఫంక్షన్లు నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చును.

* పూర్వకాలంలో ఏడు తరాలు దాటితే పాలోళ్లకు సూతకం అనేది వర్తించేది కాదు, ప్రస్తుత కాలంలో మూడు తరాలు దాటితేనే చాలు సూతకాన్ని పాటించడం లేదు.

* సూతకానికి ఇంటిపేర్ల కన్నా ఒకే గోత్రం ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కొందరికి ఊరు మారితే ఇంటిపేరు మారిపోయిన దాకలాలు ఉన్నాయి.

* ఏటి సూతకం ఉన్న ఇంట్లో ఆవు ఈనిన, ఆ ఇంట్లో ఎవరైనా ప్రసవించినంత మాత్రాన పండగలు రావు. ఆ ఇంట్లో పురుడు కార్యక్రమం మాత్రం చేసుకోవాలి.

* ఏటి సూతకం ఉన్న వారు ఆ యింటి ఆడపడచులకు ఓడి బియ్యం పోయరాదు. దగ్గరి బంధువులు ఎవరైనా వారి ఖర్చులతో పోస్తాము అంటే పోయించుకోవచ్చును.

* ఇంటి వారు ద్వాదశదిన కర్మకాండ చేసిన 12 వ రోజు గుళ్ళో నిద్ర చేయాలి. నిద్రచేసిన గుడి ప్రదక్షిణ చేస్తే దోషం ఏమి కాదు. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, గర్భగుడిలోపలికి వెళ్ళడం మొదలైనవి మాత్రం చేయరాదు.

* శాస్త్ర ప్రకారం హస్తికలను సూతకం ఉన్న సమయంలో ద్వాదశ దిన కర్మకు ముందు నదిలో కలపకూడదు. హస్తికలను నెలరోజులలోపు కలపాలి, వీలు కానీ వారికి మూడు లేదా ఐదు నెలల లోపు కలపవచ్చును.

* తలిదండ్రులు చనిపోతే వారి సంతానం దశదిన కర్మ రోజు తప్పక శిరో ముండలం 'గుండు' చేపించుకోవాలి. ఫ్యాషన్ కు పోయి ఎవరైనా గుండు చేపించుకొకపోతే ఋణ బంధం వీడక వారికి పితృ దోషాలు వర్తిస్తాయి.

* ద్వాదశ దిన కర్మ అయిపోయిన తర్వాత గుళ్ళో నిద్ర చేయకుండా ఎవ్వరి ఇంటికి వెళ్లకూడదు. గుళ్ళో నిద్ర చేసిన తర్వాత అమ్మమ్మ లేదా మేనమామల ఇంట్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత ఎవ్వరి ఇంటికైనా వెళ్లవచ్చును. అమ్మమ్మ మొదలగు వారి ఇంట్లో నిద్ర కార్యక్రమం నెలలోపలే మంచి రోజు చూసుకుని చేసిరావాలి, ఎవరూ లేనివారికి దేవుడే దిక్కుగా భావించాలి .

* ఏటి సూతకం ఉన్న వారు చనిపోయిన వారి పక్షం, తిధి ఏ రోజైతే వస్తుందో .. సంవత్సరం పాటు అదే తిధి రోజునే మాసికం పెట్టాలి. మాకు ఉద్యోగ రిత్య వీలు కాదు అని సాకుతో ఆదివారం లేదా ఏదో సెలవు రోజు పెడతాము అని పొరపాటున కూడా తిధులు విషయంలో తప్పులు చేయకూడదు.

* ప్రతి సంవత్సరం ఆబ్దికం కూడా పక్షం, తిధిని గుర్తు పెట్టుకుని .. ప్రతి సంవత్సరం అదే తిధిన పెట్టాలి, పితృ దేవతల విషయంలో మన సౌఖర్యం, వెసులుబాటు చూసుకోవద్దు.

* మాసికాలకు కానీ సంవత్సరీకాలకు కానీ భోక్తలు ఎవ్వరూ లభించనిచో .. ఫోటో ముందు నైవేద్యం పెట్టి పేదలకు, అనాధాలకు ఆ పదార్ధాలను ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం పడనవసరం లేదు. వీలైతే ఆవుకు నచ్చిన గ్రాసాన్ని కూడా పెట్టినచో గతించిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+