వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగస్య ఆది యుగాది "ఉగాది"

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఉగస్య ఆది: ఉగాది : - " ఉగ " అనగా నక్షత్రముల నడక అని అర్ధం. నక్షత్రముల నడక ప్రారంభించిన అనగా సృష్టి ఆరంభమైన కాలం యొక్క "ఆది " యుగాది...ఉగాది అయినది.

చైత్ర మాసంలో పౌర్ణమి రోజు చిత్త నక్షత్రంలో చంద్రుడు ఉండటం చేత చైత్రమాసం అనే పేరు వచ్చింది. చైత్రమాసం నుండే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలోనే చెట్లు చిగురించి పూతలు పూస్తాయి. కోయిలల కిలకిలలు, లేత మామిడి కాయలు, సన్నజాజులు, మల్లెపూల పరిమళాలు వసంతంలోని ప్రకృతి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఇదే రీతిలో మనిషి శరీరంలో కుడా కొన్ని మార్పులు కలుగుతాయి. శిశిరంలో మనిషి శరీరంలో చర్మం పొట్టు ఊడుతుంది. శరీర తత్వాన్ని బట్టి ఎక్కువ తక్కవ మోతాదు ఉంటుంది. వసంత ఋతువు మొదలు కాగానే నూతన చర్మం వచ్చి శరీరం నవచైతన్యం పొందుతుంది. పాము తన కుబుసం విడిచినట్లు ,పక్షులు (నెమల్లు ) ఈకలు రాల్చినట్లు, చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళను తొడుక్కొని శోభాయమానంగా కనబడతాయి.

Ugh means walking the stars. Started by the stars, that is, the Adi era of creation begins

ఇది ప్రకృతి నియమం. ఈ వ్యత్యాసం చైత్రం అనగా వసంత ఋతువులో ప్రారంభం అవుతుంది. ఇదే విధంగా యధా ప్రకారం కొత్త జీవితం ప్రారంభమగును. ఇదొక సైకిల్ ఆర్డర్ .ఈ కారణం చేతనే చాంద్రమాన యుగాదిని చైత్రమాసంలో మన పెద్దలు నిర్ణయించినారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభం రోజున బ్రహ్మదేవున్ని ప్రార్ధిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మదేవున్ని ప్రార్ధించే ఏకైక పండగ ఈ ఉగాదే.

ఉగాది పండుగకు సంబంధించి అనేక పురాణ గాధలున్నాయి :-

వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసుణ్ణి శ్రీ మహా విష్ణువు మత్యావతారం ధరించి. సోమకుడి చెరనుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవినికి అప్పగిస్తాడు. విష్ణువు మత్స్యావతారముగా అవతరించింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, అందుకే 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.

చారిత్రక వృత్తాంతం:- జగద్విఖ్యాతి పేరు గాంచిన విక్రమార్క చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంగా ఆ వీరుని సంస్మరణ చిహ్నంగా ఉత్సవాలు జరుపుకునుట ఆచారమైనది.

Ugh means walking the stars. Started by the stars, that is, the Adi era of creation begins

ప్రకృతిలోని మార్పు ఆధారంగా ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున నిద్రలేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. ఇది షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త చింతపండు, మిరియాలపొడి, బెల్లం, ఉప్పు మొదలగునవి వాడుతారు.

ఉగాది రోజు ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు, పూతలు వీటి ద్వారా కలిగే ఆరోగ్య ఆయుర్వేద గుణ స్వభావాలు గురుంచి తెలుసుకుందాం.

1) వేప పువ్వు 'చేదు"
2) మామిడి పిందెలు 'వగరు"
3) కొత్త బెల్లం 'తీపి"
4) కొత్త చింతపండు "పులుపు'
5) మిరియాల పొడి ' కారం"
6) ఉప్పు "కటువు'.

ఉగాది ప్రసాద శ్లోకం:-

" శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం "

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది పండగను ముఖ్యంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో , కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.

అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరములోని మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాదిలో తమ భావిజీవిత క్రమము తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోటానికి ఇష్టత చూపుతారు ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఈ పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు,పెద్దలు శాస్త్రవిధిగా తలంటు స్నానం, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. నుదుట బొట్టును పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, పంచాంగ శ్రవణం, దేవాలయాల సందర్శనం, పురాణ హితిహాస శ్రవణం చేస్తే పుణ్యఫలములు కలుగుతుంది.

ఈ షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుని ముందు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పరిగడుపున తినడము జరుగుతుంది. ఈ ప్రకియంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలములో వచ్చే కాయలను పండులను తినడము వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావదృష్టితో గ్రహించే పరమార్ధం ఎమిటంటే మానవుడు తన జీవితంలోని సుఖ,దు:ఖాలను, మంచి,చెడులను ధైర్యంగా ఎదుర్కోవాలి అని భావం .

మనిషికి కష్టం కలిగినపుడు కృంగక, సుఖం కలిగినపుడు గర్వపడక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవితం సాగించాలని భావం. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం వినడంలో ఆంతర్యం ఏమిటంటే ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఖగోళంలోని గ్రహాల గమన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం పన్నెండు రాశులు, 27 నక్షత్రాలను గణిత ప్రామాణికంగా తీసుకొని కాల గణనం చేస్తూ వస్తున్నాము.

అందుకు ఈ నూతన తెలుగు సంవత్సరాది నాటి నుండి సంవత్సర కాలం పాటు వ్యక్తి యొక్క జాతక ఆధారంగా జన్మరాశి 'జన్మ,వ్యవహారనామం ' ఆధారంగా గోచార గ్రహా ఫలితాలు,ఆ సంవత్సరంలో జరగబోయే మంచి,చెడులు ఫలితాలు , సంవత్సర కాలం వర్షపాతం,రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి,తను,కుటుంబం,దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహస్థితి గతులను ఆధారంగా తరుణోపాయాలను తెలుసుకోవడాని పంచాంగ శ్రవణం ఉపకరిస్తుంది .

ఈ పంచాంగ శ్రవణం ద్వార,జరగబోయే విపత్తులనుండి ముందే తెలుసుకుంటాము కాబట్టి శాస్త్రాన్ని నమ్మిన వారికి వారి వారి వ్యక్తిగత జాతక ఆధారంగా కొంత ముందస్తుగా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది.ఈ పంచాంగ శ్రవణాన్ని త్రేతాయుగం,ద్వాపర యుగ కాలం నుండి మొదలుకుని మొన్నటి రాజుల కాలం ప్రస్తుత రాష్ట్ర ,ప్రభుత్వాలతో సహా పంచాంగ శ్రవణాన్ని గౌరవిస్తూ,ఆచరిస్తూ వస్తున్నారు.

ఆధునిక కాలంలో కొంత మందికి ఈ శాస్త్రం పై అవగాహనలేక శాస్త్రీయ పద్ధతులు తెలియక,ఆచరించక అయోమయస్థితిలో జీవితాన్ని కొనసాగించడం గమనిస్తునే ఉన్నాం.అది వారి విజ్ఞతకే వదిలేద్దాం.మన పూర్వీకులైన ఋషులు మన బాగోగులను కోరి ఎంతో తపోనిష్టతో అనుభవ పూర్వకంగా,పరిశోధనల ద్వారా ఖగోళంలో అనేక నక్షత్రాలు ఉన్నను, ఒక నిర్ధిష్టమైన కక్ష్యలో తిరిగుతూ భూమిపై ఏవైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఖగోళంలో ఉండే నక్షత్రాలు,గ్రహాలు భూమి మీద నివసించే మానవునుపై చూపే ప్రభావానికి అనుగుణంగా భారతీయ జ్యోతిష అధ్యయనం ద్వార ఫలితాలను అంచనా వేసి శాస్త్ర పద్ధతులతో తగు జాగ్రత్త సూచనలు చేసారు.

సృష్టికి పూర్వం స్వయంభువుగా వెలసిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని సంతతి వారైన విశ్వబ్రాహ్మణులు ప్రత్యేకించి ఈ పండగను మూడు రోజులు నిష్టతో ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారు.ఇల్లాంత శుభ్రపరచుకుని ఇంటికి,వ్యాపార సంస్థలకు సున్నాలు,రంగులు వేసుకుని చక్కగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుని ఉగాదికి ఒక రోజు ముందే ఫాల్గుణ అమవాస్య రోజునాడే పూజ ప్రారంభం చేసి పాత సంవత్సరాని వీడ్కోలు తెలుపుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

వృత్తి పనిముట్లను శుభ్రపరచుకుని పచ్చని మోదుగు,మర్రి ఆకులతో విస్తరి కుట్టి అందులో పనిముట్లను ,కులదైవాలైన విశ్వకర్మ భగవానుని,కాళికాదేవి అమ్మవారి,బ్రహ్మంగారి పటములకు నానావిధ పత్ర,పుష్పాలతో సుగంధ పూజా ద్రవ్యాలతో అలంకరించుకుని గుండ్రని ఎండు కొబ్బరితో బియ్యాన్ని కొలిచి 21 లేదా 54 లేదా 108 సంఖ్య ప్రమాణంతో పచ్చని విస్తరిలో పోసి ఆ బియ్యం రాశిపై కొత్త కంచుడు జతలో "అఖండ దీపారాధ" చేసి మైసాక్షి ,సాంబ్రాణి దూపం వేసి నిష్టతో పూజిస్తారు.

ఈ పూజకు నైవేద్యాలు అన్ని మడి కట్టుకుని మగవారే తయారు చేస్తారు.దేవునికి ప్రత్యేకంగా "పడి"అనే మహానైవెద్యాన్ని,కొబ్బరి భక్ష్యాలను చేసి దానిపై ఆవు నెయ్యి వేసి 21 మర్రి ఆకులతో విష్ణు చక్ర ఆకారంలో విస్తరి కుట్టి అందులో మహానైవేద్యాన్ని నివేదన చేస్తారు.నూతన జంధ్యం ,చేతికి రక్షా కంకణం ధరించి పూజ చేస్తారు.

అఖండ ( నంద ) దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకుని మరుసటి రోజైన ఉగాది నాటి పర్వదినాన ప్రత్యేక పూజలు చేసి గోదుమలతో సరి ,భేసి పంచాంగ ఫలితాలను చూసుకుని ఆ రోజు కూడ నిష్టతో ఉంటారు.అఖండ దీపారాధన చేసిన మూడవ రోజు శుభముహూర్త శుభ ఘడియలలో కులదేవతలకు మహా నైవేద్య నివేదనచేసి మహాహారతినిచ్చి అఖండ దీపాన్ని,పూర్ణకళశాన్ని,పనిముట్లను కదిపి (ఉద్వాసన చేసి) ఆరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతపూజ జరిపించుకుని మూడు రోజుల పూజదీక్షనుండి విరమణ పొందుతారు.ఈ మూడు రోజులు తినేందుకు పచ్చని మోదుగ ఆకులతో విస్తర్లు తయారు చేసుకుని ఏక భుక్త భోజనం చేస్తారు.మూడవ రోజు నుండి తిరిగి వారి వారి వ్యాపారంలో నిమగ్నమౌతారు.

ఈ విధంగా భారత దేశంలోని హిందువులు ప్రకృతి అందించే ఫల,దాన్య సంపందను అనుభవిస్తున్నందులకు కృతజ్ఞతాభావం చేత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.అదే రోజే జ్యోతిష పండితులను కలిసి వారికి దక్షిణ తాంభూలాదులనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు,ఈ పర్వ దినం ప్రకృతి "సంపద" పండగా గుర్తించి దైవ దర్షనాలు,పురాణాశ్రవణం చేసి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

English summary
Ugadi Adi: Ugadi: - "Ugh" means walking the stars. Started by the stars, that is, the "Adi" era of creation begins ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X