ఎత్తిపోతలకు త్వరలో శంకుస్థాపన
హైదరాబాద్: గోదావరిపై ఎత్తిపోతల పథకానికి ప్రస్తుత మహిళా జన్మభూమి కార్యక్రమం పూర్తయిన తర్వాత జూన్ 15-20 తేదీల మధ్య శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచబ్యాంకు సహకారంతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నది.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణా జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెప్పింది. వివాదస్పద ప్రాజెక్టులు ఇచ్చంపల్లి, పులిచింతల, పి.బ్యాడగెరి ఫీడర్ ఛానెల్ పనులపై గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి, ఉభయకమ్యూనిస్టు పార్టీలు, మజ్లిస్ హాజరయ్యాయి. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి పూర్తి అండగా నిలుస్తామని అవసరమైతే ఈ ప్రాజెక్టు విషయంలో సంప్రదింపులకు చత్తీస్‌ఘడ్ బయలుదేరడానికి తాము సిద్ధమేనని విపక్షాల నేతలు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అయితే తెలంగాణా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే పులిచింతల ప్రాజెక్టును చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు కోరారు. మజ్లిస్ సభ్యులు మాత్రం పులిచింతలను తీవ్రంగా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications
