అసూయతోనే కర్ణాటక అభ్యంతరం
హైదరాబాద్: కృష్ణా మిగులు జలాల వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులన్నీ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే వున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు వుండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ ఆరోపిస్తున్నట్టుగా కేంద్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో పక్షపాతవైఖరితో అనుమతించిన ప్రాజెక్టులు ఏమీ లేవని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక ఈ మధ్యనే కోర్టుకు వెళ్లిన విషయం ప్రస్తావిస్తూ, కావలంటే మరోసారి కోర్టుకు వెళ్లవచ్చని చంద్రబాబు తీవ్రంగా అన్నారు.
ఇచ్చంపల్లి పై 95 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి గతంలోనే అంతా అంగీకారం తెలిపారని ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ అభ్యంతరాలకు కూడా అర్ధం లేదని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి పథకాల విషయంలో కేంద్రాన్ని ఒప్పించి, నచ్చజెప్పి ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుండటంతో, రాష్ట్ర ప్రగతి పట్ల ఈర్ష్య తో ఈ రకమైన ఆరోపణలకు పొరుగు రాష్ట్రాలు దిగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.












Click it and Unblock the Notifications