ఓట్ల రాజకీయాలను తిప్పికొట్టడానికే..
న్యూఢిల్లీ: ఓటు బ్యాంక్ రాజకీయాలను ఎదుర్కోవడానికే భారతీయ జనతా పార్టీ (బిజెపి) 1989లో రామజన్మభూమి ఉద్యమంలో చేరిందని కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ చెప్పారు.వివాదాస్పద కట్టడం విషయంలో ఇతర పార్టీలు వోటు బ్యాంక్ రాజకీయాల కోసం బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ వైఖరిని బలపరుస్తుంటే ఆ రాజకీయాలను తిప్పి కొట్టడానికి బిజెపి రామజన్మ భూమి ఉద్యమంలో చేరిందని ఆయన అన్నారు. లెబర్హాన్ కమిషన్ ముందు ఆయన మంగళవారం కూడా వాంగ్మూలం ఇచ్చారు.
అయోధ్య వివాదంపై 1980 దశకం మధ్య వరకు ప్రతిఅంశాన్ని కోర్టులు నిర్ణయిస్తూ వచ్చాయని, అప్పటి వరకు ఉద్యమం రామాలయం కోసమే జరుగుతూ వచ్చిందని ఆయన చెప్పారు. ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా 35 యేళ్ల తర్వాత కోర్టు ఆదేశాలను చాలా రాజకీయ పార్టీలు సవాల్ చేశాయని ఆయన అన్నారు. వాస్తవాలపై, చరిత్రపై,స్వచ్ఛతపై కాకుండా ఇదంతా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే జరిగిందని ఆయనవిమర్శించారు.
ఈ విషయంపై బిజెపి, శివసేనలకు మధ్య గల విభేదాలపై ప్రశ్నించగా కోర్టు ఆదేశాలను గౌరవించాలనేది తమ పార్టీ నిర్ణయమని ఆయన జవాబిచ్చారు. కూల్చివేతను తమ పార్టీ తప్పని చెప్పిందని, శివసేన భిన్నాభిప్రాయంతో ఉన్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
