భువనేశ్వర్‌ః ఒరిస్సా అసెంబ్లీపై శనివారం నాడు వందలాది మంది విశ్వహిందూ, బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి జరిపారు. భద్రతాదళ సిబ్బంది నిస్సహాయంగా చూస్తూ నిలబడగా హిందూత్వ శక్తులు చట్టసభలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించాయి.
శుక్రవారం నాడు సభలో ఈ రెండు సంస్థలకు వ్యతిరేకంగా కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్, విహెచ్‌పి ఈ దాడికి పాల్పడ్డాయి. జై శ్రీరామ్, నవీన్ పట్నాయక్ ముర్దాబాద్ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.అసెంబ్లీ ప్రధాన ద్వారం నుంచే వందల సంఖ్యలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ లోపలికి దూసుకువచ్చారు. సభ భోజనవిరామం కోసం వాయిదా పడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. సభ్యులు సభ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లుతున్న సమయంలో పిల్లలు, మహిళలతో సహా వందలాది మంది లోపలికి దూసుకురావడంతో ఏం జరుగుతున్నదో కొద్దిసేపు అర్ధం కాలేదు. అసెంబ్లీ భవనంలో విచ్చలవిడిగా తిరుగుతూ కిటికీల అద్దాలను, పూలకండీలను బద్దలు కొట్టారు. లైబ్రరీ కాంప్లెక్స్‌లో మంత్రులు నేమ్‌ప్లేట్లను విరిచేశారు. గోడలకు అమర్చిన అగ్నిమాపక సిలెండర్లను గార్డెన్‌లోకివిసిరేశారు. దాదాపు 20 నిమిషాల పాటు అసెంబ్లీలో కిష్కింధకాండ కొనసాగింది.