దేశంలో తొలి 20 KW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ మన తెలంగాణాలో.. ప్రత్యేకతలివే!
మనం ఎన్నో రకాల విద్యుత్ ఉత్పత్తిని చూస్తున్నాం. జల విద్యుత్, సోలార్ పవర్, థర్మల్ పవర్, హైడల్ పవర్, విండ్ పవర్ ఇలా... అయితే మన భూమి లోపలి పొరల్లోని ఉష్ణ శక్తిని కూడా పవర్ గా మార్చే కొత్త ఆలోచన జియో థర్మల్ పవర్. దేశంలోని లడఖ్ లోని పూగా వ్యాలీలో తొలి ఒక మెగావాట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ మొట్టమొదటి ప్లాంట్ గా ఏర్పాటు చేస్తున్నారు.
ఇదే సమయంలో మన తెలంగాణా రాష్ట్రంలో కూడా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో 20 kW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించింది. భూగర్భ ఉష్ణ శక్తి అంటే భూమి నుండి వెలువడే వేడి శక్తి. అదే జియో థర్మల్. భూగర్భ ఉష్ణ సాంకేతికత ద్వారా భూమి ఉపరితలం లోపల ఉన్న వేడిని వెలికి తీసి దీనిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చు.

ఈ పైలట్ ప్లాంట్ క్లోజ్డ్-లూప్ బైనరీ ఆర్గానిక్ రాంకిన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని ద్వారా విద్యుత్ ను తయారు చేయనున్నారు. దేశంలోనే ఈ సాంకేతికతను ఉపయోగించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా ఉంది.మణుగూరు ప్రాంతంలో బొగ్గు నిల్వల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో సుమారు వెయ్యి మీటర్ల లోతులో వేడినీటి వనరులు ఉన్నాయని గుర్తించారు.
ఈ వేడినీటి ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేయటానికి 20 KW పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 381 ఉష్ణ అసాధారణ ప్రాంతాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించి, సుమారు 10,600 మెగావాట్ల భూఉష్ణ విద్యుత్ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ "జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా, 2022"ను ప్రచురించింది.
మనదేశంలో 10,600 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల భూ ఉష్ణ మండలాలు ఉన్నాయని చెప్పటం, అందులో తెలంగాణా కూడా ఉండటం, తెలంగాణా రాష్ట్రంలోని మణుగూరులో ఉన్న ప్రత్యేక భూ పరిస్థితుల కారణంగా అక్కడ భూ ఉష్ణ విద్యుత్ తయారీకి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ప్లాన్ చేయటం ఒక ఆసక్తికర అంశం.












Click it and Unblock the Notifications
