ఏపీలో మోడల్ లేబర్ అడ్డాలు - రోజువారీ కూలీల కోసం, విజయవాడలో పైలెట్ ప్రాజెక్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. రోజువారీ పనులు చేసుకునే కూలీల కోసం కూడా సీఎం చంద్రబాబు వసతులు కల్పించి వారి కోసం తాము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీ కూలీలు ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ రోడ్ల పక్కన పని కోసం ఎదురుచూసే పరిస్థితులు మార్చాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 'మోడల్ లేబర్ అడ్డాలు' ఏర్పాటు చేస్తున్నారు.
ఇవి లేబర్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లుగా ఏర్పాటు కానున్నాయి. తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి సహా 20 ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు, కూర్చోవడానికి సీటింగ్, టాయిలెట్లు, ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఉచిత నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు.

ఆధునిక నిర్మాణ పరికరాలపై శిక్షణ పొంది ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఈ లేబర్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల ద్వారా కలుగుతుంది. దళారులు మధ్యలో ఉండకుండా నేరుగా పనులు దొరికేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటి యజమానులు లేదా కాంట్రాక్టర్లు ఈ కేంద్రాలకు వచ్చి అవసరమైన కార్మికులను తీసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫోన్ ద్వారా కూడా పనులు చేసే వారికి అభ్యర్థనలు అందుతాయి.
దీనివల్ల కార్మికుడికి పూర్తి కూలీ చేతికి అందుతుంది. పని కోసం రోడ్ల మీద నిలబడకుండా ఒక అడ్డా దొరికినట్టు అవుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రోజువారీ కూలి పనులు చేసే వారికి అదనపు సహాయాలు కూడా కల్పిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆడపిల్ల వివాహానికి రూ.25,000, సహజ మరణం సంభవిస్తే రూ.60,000, అంత్యక్రియలకు రూ.20,000 సహాయం అందిస్తున్నారు.
ఉచిత ప్రమాద బీమా, ఈ-శ్రమ్ కార్డు నమోదు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ చర్యలతో కార్మికులకు గౌరవం, భద్రత, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ ఫలితాల ఆధారంగా రాష్ట్రం అంతటా విస్తరించే ప్రణాళిక ఉంది.












Click it and Unblock the Notifications
