తెలంగాణాలో బిజినెస్ మెన్ కు గుడ్ న్యూస్.. ఇకపై మీ వ్యాపారాలు సులువుగా!
తెలంగాణా రాష్ట్రంలో వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు తమ కార్యాకలాపాలు సులభతరం చేసేలా తెలంగాణా సర్కార్ కీలక బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో తెలంగాణలో ఇకపై వ్యాపారాలు నిర్వహించడం మరింత సులభం కానుంది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రజా విశ్వాసం నిబంధన సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ బిల్లు వివరాలు వివరించారు.
ఈ బిల్లు తెలంగాణా వ్యాపారులకు సులభంగా వ్యాపారాలు చేసేలా, అనుకూలంగా మార్పులు చేస్తూ తీసుకువచ్చామని అన్నారు. వివిధ శాఖల పరిధిలో జరిగే చిన్నపాటి ఉల్లంఘనలకు ఇప్పటి వరకు కఠిన శిక్షలు ఉండేవి. ఇకపై వాటికి బదులు జరిమానాలు విధించేలా ప్రజా విశ్వాసం నిబంధన సవరణ బిల్లులో మార్పులు చేశారు.ఈ చట్టసవరణ బిల్లు ద్వారా కాలం చెల్లిన అనవసర చట్టాలను రద్దు చేస్తామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం జనవిశ్వాస్ బిల్లు ద్వారా 180కి పైగా చిన్న నేరాలపై ఉన్న భారీ శిక్షలను తొలగించిందని గుర్తు చేశారు. అదే దిశగా తెలంగాణ కూడా అడుగులు వేస్తోందని, దీంతో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా వ్యాపార నిర్వహణ సౌలభ్యం పెరుగుతుందని ఆయన అన్నారు.ప్రజలకు ఈ చట్టం గురించి పూర్తి అవగాహన కల్పిస్తామని ఆందోళన అవసరం లేదన్నారు.
బ్యాంకర్లు చిరు వ్యాపారులకు సహకరించాలని ఆదేశాలు ఇస్తామని మంత్రి చెప్పారు. అటవీ శాఖకు సంబంధించిన సమస్యలు కూడా సభలో చర్చకు రాగా, చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు పడుతున్నాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గుర్తు చేశారు.ఈ బిల్లుకు సంబంధించి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ చిన్న వ్యాపారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే అవకాశం ఉండాలని, పోలీసుల జోక్యం తగ్గాలని అన్నారు.
మరో ఎమ్మెల్యే హరీశ్‌బాబు అటవీ ప్రాంతాల్లో గొర్రెల మేపుతున్నవారిని అధికారులు వేధించకూడదని చెప్పారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర అటవీ చట్టం, పీడీ చట్టం వంటి వాటిపై పునరాలోచన అవసరమని సూచించారు. ఎంఐఎం, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు తెలిపారు.ఈ బిల్లు ఆమోదంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. వ్యాపార వాతావరణం మెరుగుపడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
