అయోధ్యః అయోధ్యలో శిలాదాన్ కార్యక్రమాన్ని వివాదస్థలం వెలుపల నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మర్యాద, గౌరవాలను కాపాడినట్టుగా రామజన్మభూమి న్యాస్ నేత రామచంద్ర పరమహంస చెప్పారు.
తాము ముందుగా నిర్ణయించిన ప్రకారం పూజను కొనసాగించివుంటే అయోధ్యలో నెత్తుటేరులు పారేవని ఆయన అన్నారు. శిలాదాన్ కార్యక్రమం ఆలయ నిర్మాణం ఆరంభానికిసంకేతమని ఆయన స్పష్టం చేశారు. బాబ్రీ మసీదును ఏవిధంగానైతే బలవంతంగా నిర్మించారో తాము ఆలయాన్ని అదే విధంగా అవసరమైతే బలవంతంగా నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఇదిలా వుండగా రామాలయ నిర్మాణానికి సంబంధించి విహెచ్‌పి, రామజన్మభూమి న్యాస్ తలపెట్టిన శిలాదాన్ కారణంగా ఏర్పడ్డ ఉద్రిక్తత నుంచి అయోధ్య క్రమంగా కోలుకుంటున్నది. సుమారు 40 వేల జనాభా వున్న అయోధ్యలో శనివారం నాడు పరిస్థితి కొంత మారింది. గత వారం రోజులుగా అయోధ్యవాసులు కారాగారంలో వున్నట్టుగా గడిపారు. మొత్తం పట్టణాన్ని భద్రతా దళాలు దిగ్బంధం చేశాయి. క్రమంగా అయోధ్యకు రాకపోకలను పునరుద్దరిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కరసేవకులు అయోధ్య వీధుల్లోస్వేచ్ఛంగా తిరుగుతు కనిపించారు. శనివారం నాడు పరమహంస రామచంద్రదాస్ యథావిధిగా పూజల్లో పాల్గొన్నారు.