న్యూఢిల్లీః పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. లోక్ సభ సమావేశం కాగానే జమ్ము కాశ్మీర్ లో జరిగిన నరమేధాన్ని ప్రస్తావించందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు.
స్పీకర్ ఆదేశాల మేరకు ఇటీవల పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లోక్ సభస్పీకర్ బాలయోగి సతీమణి గంటి విజయకుమారి, శిబూసొరేన్, ఉత్తరప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికైన త్రిలోక్ నాధ్ వున్నారు. ఆ తరువాత వాజ్‌పేయి ఇటీవల తన క్యాబినెట్ లో చేరిన కొత్త వారిని సభకు పరిచయం చేశారు. అద్వానీ తో సహా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారిని వాజ్‌పేయి పేరుపేరునా సభకు పరిచయం చేయగా సభ్యులు బల్లలు చరిచి హర్షం ప్రకటించారు. ఇటీవల మరణించిన ఇద్దరు ఎం.పి.ల మృతికి సభ సంతాపం ప్రకటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సభ మంగళవారం నాటికి వాయిదా పడింది.