Home
విజయనగరం/ శ్రీకాకుళం: నక్సల్స్ హెచ్చరికలకు బెదిరేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు.
రౌడీయిజాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. జనబలం ఉన్న తెలుగుదేశం పార్టీని నిషేధించే నైతిక హక్కు నక్సల్స్‌కు లేదని, జనబలం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో శంకుస్థాపనలు చేసి వదిలేసిన నీటిపారుదల ప్రాజెక్టులను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన చెప్పారు. నీటి పారుదల రంగానికి తమ ప్రభుత్వం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆయన చెప్పారు.
విజయనగరం జిల్లాలోని వెంగళరాయ తదితర ప్రాజెక్టులకు కాంగ్రెస్ శంకుస్థాపనలు చేస్తే తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసిందని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాను నీటిపారుదల రంగంలో మిగతా జిల్లాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. చీపురుపల్లి గ్రామంలో ఆయన లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేశారు. గ్రామాలు బాగుపడితేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!