విశాఖ వన్డేలో భారత్ ఘనవిజయం
విశాఖపట్నం: పాక్‌పై విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ తన ముందు పెట్టిన భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో పాక్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. దాంతో 58 పరుగుల తేడాతో ఓటమిని చవి చూడక తప్పలేదు. పాక్ 298 పరుగులకు 44 ఓవర్లలోనే ఆలవుట్ అయింది.
విశాఖ వన్డే విజయంతో భారత్ పాక్‌పై ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 లీడ్‌తో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ విశాఖ స్టేడియంలో పరుగుల వరదను పారించింది. సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా ధోని బ్యాటింగ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాక్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టింది. మైదానం నలువైపులా సిక్స్‌లు, ఫోర్లతో ధోని అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ధోనె 148 పరుగులు చేశాడు. ఆ రకంగా పాక్‌పై సెంచరీ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా కూడా అతను రికార్డు నమోదు చేసుకున్నాడు. ధోని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
సచిన్ టెండూల్కర్ కొద్ది పరుగులతో రన్నవుట్ అయినప్పటికీ ఆ తర్వాత సెహ్వాగ్‌కు తోడుగా ధోనే పరుగుల పంటను పండించారు. సెహ్వాగ్ 74 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ చెలరేగిపోతున్న ధోనికి స్ట్రయికింగ్ ఇస్తూ పోయాడు. ద్రావిడ్ 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ గంగూలీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. భారత్ 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. పాకిస్థాన్‌పై ఇది అత్యధిక స్కోర్. ఇంతకు ముందు ఆస్ట్రేలియా చేసిన 338 పరుగులే రికార్డు. రజాక్, యూసుఫ్ యోహానా భారత బౌలర్లను ఎదుర్కుని నిలబడే ప్రయత్నం చేశారు. ఇంజమామ్ రన్నవుట్ మ్యాచ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇంజమామ్ అవుట్‌తో భారత్‌కు విజయం ఖాయమని తేలిపోయింది. రజాక్ 88 పరుగులు, యోహానా 71 పరుగులు చేశారు. చివరలో అక్మల్ కొన్ని మెరుపులు మెరిపించాడు. నెహ్రాకు నాలుగు వికెట్లు లభించగా, యువరాజ్ సింగ్‌కు మూడు వికెట్లు లభించాయి.












Click it and Unblock the Notifications