ఆయుధాలపై చర్చకు ముందు ఒప్పుకోలు: దిగ్విజయ్
హైదరాబాద్: నక్సలైట్లు ఆయుధాల స్వస్తిపై చర్చకు ముందు అంగీకరించారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. నక్సలైట్లతో చర్చలు జరగాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఏడాది పాలనపై మ్యానిఫెస్టో అమలు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై మ్యానిఫెస్టో అమలు కమిటీ దాదాపు రెండు గంటల సేపు సమీక్షించింది. ఈ సమీక్షానంతరం దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు.
వైయస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 28 హామీలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా నూటా ఇరవైకి పైగా హామీలను అమలు చేయాల్సి ఉందని, ఈ హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన చెప్పారు. అయితే నాలుగు హామీలు అమలు చేయడం సాధ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది. బలహీనవర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విడుదల, మధ్యాహ్న భోజన పథకం, వైద్య సేవలు వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు.












Click it and Unblock the Notifications