అప్పుల బాధలతో రెండు కుటుంబాలు ఆత్మహత్య
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో రెండు కుటుంబాలను అప్పుల బాధలు బలి తీసుకున్నాయి. అప్పు బాధలు తాళలేక రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామంలో సులోచన ఒక స్త్రీ తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుల చేసి మస్కట్ వెళ్లిన భర్త ఉపాధి లేక డబ్బులేవీ పంపకపోవడంతో భార్య అప్పులు తీర్చలేకపోయింది. ఆమెకు కూడా ఏ విధమైన ఉపాధి లభించక జీవనమే దుర్భరమైన స్థితిలో అప్పుల బాధలు కూడా పీడించసాగాయి. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో పాటు ఆత్మహత్య చేసుకుంది.
ఇదిలా వుంటే, తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇస్త్రీ పెట్టెలు తయారు చేసే వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యకు, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు కుటుంబ సభ్యులు అసువులు బాశారు. తాను అప్పులు చేసి భరించలేని స్థితికి చేరుకోవడానికి ముగ్గురు వ్యక్తులు కారణమని ఆయన ఒక లేఖలో పేర్కొన్నాడు. తనను ఆ ముగ్గురు అప్పుల పాలు చేశారని ఆయన ఆరోపించాడు.












Click it and Unblock the Notifications