రాజీనామాలపై 18న వరంగల్‌లో వివరణ: నరేంద్ర
న్యూఢిల్లీ: రాష్ట్రంలో తమ పార్టీ మంత్రులు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఈ నెల 18వ తేదీన వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో వివరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. ఇదిలావుంటే, తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటయిన ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉపసంఘం తిరిగి ఈ నెల 24వ తేదీన సమావేశమవుతుందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్రణబ్ కమిటీ గురువారంనాడు సమావేశమైంది. అయితే ఈ సమావేశం పెద్దగా తేల్చిందేమీ లేదు. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
యుపి ఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు తెలంగాణను వ్యతిరేకిస్తుండడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగింది. వారి చేత రాజీనామాలు ఉపసంహరింపజేసి తిరిగి ప్రభుత్వంలో చేర్పించడానికి దిగ్విజయ్ సింగ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ స్థితిలో ప్రణబ్ కమిటీ సమావేశాలను నిర్వహిస్తూ తెలంగాణపై ఏదో చేస్తున్నామనే అభిప్రాయంకలిగించడమే కాంగ్రెస్ ఎత్తుగడగా మారినట్లు కనిపిస్తోంది. తెలంగాణపై తమ నివేదిక సమర్పించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కూడా ప్రణబ్ ముఖర్జీ గురువారంనాడు చెప్పారు.












Click it and Unblock the Notifications
