కొలిక్కిరాని ఆర్టీసి చర్చలు: పట్టువీడని జెఎసి
హైదరాబాద్: ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులకు, ప్రభుత్వానికి మధ్య మంగళవారం సాయంత్రం చర్చలు ప్రారంభమయ్యాయి. రవాణా మంత్రి కన్నా లక్ష్మినారాయణతో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జె ఎసి) నాయకులు చర్చలు జరుపుతున్నారు. 21 అంశాలపై ఇరుపక్షాలకు మధ్య అంగీకారం కుదరడం లేదు. ఆర్టీసికి 13000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తుండగా, ఆర్టీసికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వడం న్యాయమని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. ఆర్టీసి కార్మికులకు తాత్కాలిక భృతి ఇచ్చే విషయంలో కూడా ఇరు పక్షాలకు మధ్య అంగీకారం కుదరడం లేదు.
సమస్య పరిష్కారం కోసం ఒపిక పట్టాలని ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులను కోరుతోంది. అయితే కాలయాపన చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జె ఎసి నాయకులు అంటున్నారు. దాంతో ఐ ఐయంతో అధ్యయనం చేయించి నివేదిక రావడానికి రెండు నెలలు పడుతుందని, ఈ రెండు నెలలు కార్మికులు ఓపిక పట్టాలని చర్చల్లో ప్రభుత్వం తెలియజేసింది. అయితే అందుకు కార్మిక సంఘాల నాయకులు అంగీకరించడం లేదు. కార్మికుల సమస్యల పరిష్కారంపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం రేపు (బుధవారం) హైకోర్టుకు నివేదించాల్సి ఉంది. అయితే సమస్య పరిష్కారానికి మరింత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరాలనే యోచనలో ఉంది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తిరిగి సమ్మె నోటీసు ఇవ్వాలనే యోచనలో కార్మిక సంఘాలున్నాయి. తిరిగి ఆగస్టు రెండో వారంలో సమ్మెకు దిగాలని అవి అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications