వైయస్‌కు వోక్స్‌వ్యాగన్ లేఖ: పూర్తి ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వోక్స్ వ్యాగన్ కుంభకోణం నుంచి పూర్తి ఊరట లభించింది. భారత మార్కెట్‌లో ప్రవేశించాలనే గట్టి కోరిక తమకు ఉందని వోక్స్ వ్యాగన్ తెలియజేసింది. ఈ విషయంలో జర్మనీ మాజీ రాయబారి ఫ్రాంక్ ఎల్బెతో సంబంధాలు పెట్టుకుని సంప్రదింపులు జరపాలని వోక్స్ వ్యాగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఒక లేఖ రాసింది.
ఇటీవలి అనూహ్యమైన, విచారకరమైన సంఘటనల వల్ల తాము ఇండియా ప్రాజెక్టును తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టామని, భారత మార్కెట్‌లో ప్రవేశించాలనే దృఢచిత్తంతో ఉన్నామని వోక్స్ వ్యాగన్ ఆ లేఖలో అన్నది. తమ శాఖను రాష్ట్రంలో ప్రారంభించాలని కూడా అనుకుంటున్నామని తెలియజేసింది. బోర్డు స్కోడా సభ్యుడు షూష్టర్ అనధికారికంగా భారత్‌లో కార్యకలాపాలు సాగించారని, వశిష్ట వాహన్‌కు డబ్బుల చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, సూష్టర్ అక్రమ లావాదేవీల వల్ల జరిగిన నష్టానికి తాము బాధ్యత వహిస్తామని వోక్స్ వ్యాగన్ వివరించింది.
తమ మేనేజ్‌మెంట్ బోర్డుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మాజీ జర్మన్ రాయబారి ఫ్రాంక్ ఎల్బేను తమ ప్రత్యేక దూతగా నియమించుకున్నామని వోక్స్ వ్యాగన్ తెలియజేసింది. భారత్‌కు కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని అందించడం, ఇప్పుడు, ఆ తర్వాత తమ సంబంధాలు దెబ్బ తినకుండా చూడటం ఎల్బే బాధ్యతలని వోక్స్ వ్యాగన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications