వైయస్‌వన్నీ స్వప్రయోజనాలే: రోడ్‌షోలో బాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చం6దబాబునాయుడు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మంగళవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షో నిర్వహించారు. ఆయన పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల కాలంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన అన్నారు. తమను గెలిపిస్తే కరీంనగర్ కష్టాలు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో మంత్రులకు ముడుపులు ముట్టాయని, మంత్రులు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రుల శాఖలు మార్చి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి ఎం. సత్యనారాయణరావు ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పూటకో మాట మాట్లాడడంలో సత్యనారాయణరావు దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుంచి గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె. చంద్రశేఖర్ ఢిల్లీలో మకాం వేసి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత కనిపించకుండా పోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
