అనంతపురంలో టిడిపి కార్యకర్త దారుణహత్య
అనంతపురం: అనంతపురంలో మరోసారి ఫాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. అనంతపురం నడిరోడ్డు మీద ఎస్‌వి కాలేజీ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరుపతయ్య దారుణ హత్యకు గురయ్యారు. అన్న కూతురు మాధవిని కాలేజీలో వదిలి మోటార్ సైకిల్‌పై తిరిగి వెళ్తుండగా తిరుపతయ్యపై ప్రత్యర్థులు బాంబులతో దాడి చేశారు. మాధవి ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకుంది.
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన తిరుపతయ్యపై ముగ్గురు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జూబిలీహిల్స్ కారు బాంబు దాడి కేసు నుంచి తప్పించుకు తిరుగుతున్న భానుకోట కిష్టప్ప వర్గీయులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని తిరుపతయ్య బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతయ్య కుటుంబ సభ్యులను పెనుకొండ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత పరామర్శించారు. పరిటాల రవి హత్య తర్వాత మళ్లీ ఫాక్షన్ కక్షలు భగ్గుమనడం ఇదే మొదటిసారి.
తన భర్త పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పెనుకొండ తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆందోళన వ్యక్తంచేశారు. తనకు తగిన భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఇప్పటికే ఫోన్ బెదిరింపులు వస్తున్నాయని ఆమె చెప్పారు. సూరి పంటి నొప్పి పేరుతో ఆస్పత్రికి వస్తూ హత్యలకు కుట్ర చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.
ఇదిలావుంటే, పరిటాల హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డికి, మరో పన్నెండు మందికి ఎల్లుండి వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ అనంతపురం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే టిడిపి కార్యకర్త హత్య నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కోర్టులో హాజరు పరచలేదు.












Click it and Unblock the Notifications
