వైయస్ హామీలు నీటి మీది రాతలే: బాబు
రాజమండ్రి: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మీది రాతలే అయ్యాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆయన మంగళవారంనాడు తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో పర్యటించారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆయన ఆయన అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ స్టంట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనికి కాంగ్రెస్ నాయకులు పూనుకున్నారని, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పిఠాపురంలో ఆయనకు మహిళల నుంచి ఘనస్వాగతం లభించింది. ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే కనిపిస్తోందని చంద్రబాబు తన రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న వైయస్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం వైయస్ రాజశేఖర్‌రెడ్డి అబద్దాలు చెప్పారని ఆయన అన్నారు. తమ హయాంలోని పాలనను, ప్రస్తుత వైయస్ పాలనతో బేరీజు వేసుకుని చూసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యర్థులను చంపే కార్యక్రమాన్ని వైయస్ ఒక పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications