బిసిలపై వైయస్ ప్రభుత్వం కక్ష సాధింపు: బాబు
నల్లగొండ: వెనకబడిన తరగతులపై (బిసిలసై) కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. బిసిలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. ఆయన బుధవారంనాడు నల్లగొండ జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు బయలుదేరుతూ మధ్యలో ఎల్.బి. నగర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సూర్యాపేటలో రోడ్‌షో నిర్వహించారు. నల్లగొండలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
డ్వాక్రామహిళలకు తాము అధికారంలో ఉన్నప్పుడున్నంత గౌరవం ఇప్పుడు లేదని ఆయన అన్నారు. మాదిగలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. కమీషన్ల కోసం కల్లుగీత కార్మికుల పొట్టలు కొట్టే జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన అన్నారు. ఒక బల్బు ఉన్నవారికి ఉచిత విద్యుత్‌ను ఇస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గాలికి వదిలేశారని ఆయన అన్నారు. మేఘమథనం పేరుతో 50 కోట్ల రూపాయలను దిగమింగారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన అడిగారు. నిరుద్యోగాలకు ఉద్యోగాలిస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications