వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు పార్టీతో సహా ఏడింటిపై నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మావోయిస్టులపై రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం మావోయిస్టుల అనుబంధ సంస్థలకు కూడా వర్తిస్తుంది. మావోయిస్టులపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బుధవారం సాయంత్రం ఫైలుపై సంతకం చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో రాజీవ్‌ నగరబాటలో పాల్గొని తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఆ ఫైలుపై సంతకం చేశారు.మొత్తం ఏడు సంస్థలపై నిషేధం విధించినట్లు హోం మంత్రి కె. జానారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. సిపి ఐ (యంయల్‌) మావోయిస్టు పార్టీ, రాడికల్స్‌ విద్యార్థి సంఘం (ఆర్‌యస్‌యు), రాడికల్‌ యూత్‌ లీగ్‌ (ఆర్‌వైయల్‌), రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య, విప్లవ రచయితల సంఘం (విరసం) నిషేధానికి గురయ్యాయి. గతంలో విరసంపై నిషేధం లేదు. ఇప్పుడు కొత్తగా విరసంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందని జానా రెడ్డి చెప్పారు.

జనశక్తి, ప్రజాప్రతిఘటన వంటి ఇతర విప్లవ గ్రూప్‌ల మీద నిషేధం లేదని, అయితే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఆ సంస్థలకు చెందినవారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులకు దేశవ్యాప్త యంత్రాంగం ఉందని, అందువల్ల దానిపైనే నిషేధం విధించామని ఆయన చెప్పారు.

నక్సల్స్‌తో మొదటి విడత చర్చల తర్వాత దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, నక్సల్స్‌ చిత్రహింసలకు తదితర హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. మావోయిస్టులపై నిషేధం విధించడానికి గల నేపథ్యాన్ని ఆయన బుధవారం సాయంత్రం వివరించారు. ప్రభుత్వం సంయమనం పాటించిందని, నిషేధం విధించాల్సిన అవసరం లేకుండానే చట్టపరిధిలో వ్యవహరిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని, శాంతి భద్రతలను కాపాడడానికి ప్రయత్నించిందని ఆయన చెప్పారు. తీవ్రవాదుల హింస మరింతగా పెచ్చరిల్లిందని, మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డితో పాటు మరికొంత మందిని మూకుమ్మడిగా సభ్య సమాజం సహించని విధంగా హత్య చేశారని, వేంపెంటలో ఊచకోతకు దిగారని, పోలీసు స్టేషన్లపై దాడికి దిగారని, ఈ స్థితిలో ప్రజల్లో భయోత్పాతాన్ని తగ్గించడానికి, శాంతి భద్రతల పరిరక్షణకు నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి మాత్రమే ఈ నిషేధం కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నక్సలైట్లకు భోజనం పెట్టారనే ఆరోపణపై కొంత మంది సామాన్యులను, సానుభూతిపరులను వేధించినట్లు విమర్శలు వచ్చాయని, అయితే ఆ కారణాలతో ఎవరిపై చర్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని పోలీసు స్టేషన్లకు కచ్చితమైన ఆదేశాలు వెళ్తాయని ఆయన అన్నారు. హింసకు పాల్పడేవారి మీద, హింసను ప్రేరేపించేవారి మీద చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

మావోయిస్టులపై నిషేధం విధించడం పట్ల రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ హర్షం వ్యక్తం చేశారు. మావోయిస్టులు అతి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారని ఆయన ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. మావోయిస్టులకు ప్రభుత్వం తగిన అవకాశం ఇచ్చిందని, నిషేధం విధించేలా మావోయిస్టుల చర్యలే ఒత్తిడి తెచ్చాయని ఆయన అన్నారు.

ప్రపంచబ్యాంక్‌, సామ్రాజ్యవాదం ఒత్తిడి మేరకే ప్రభుత్వం మావోయిస్టులపై నిషేధం విధించిందని మావోయిస్టుల మాజీ ప్రతినిధి, విప్లవ కవి వరవరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అప్రకటిత నిషేధం కొనసాగిస్తోందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని అధికారికంగా ప్రకటించిందని, దీంట్లో పెద్ద తేడా లేదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నవారు ఒక రకంగా, అధికారంలో లేనివారు ఒక రకంగా వ్యవహరిస్తున్నారని, అధికారంలో వున్నవారు నిషేధాన్ని బలపరుస్తుండగా అధికారంలో లేనివారు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారని, అధికారంలో లేని కాంగ్రెస్‌ నాయకులు నక్సలైట్లతో చర్చలు జరగాలని ఆన్నారని ఆయన వివరించారు.

నిషేధం వల్ల వచ్చే తేడా ఏమీ ఉండదని మావోయిస్టుల మాజీ ప్రతినిధి, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్‌ అన్నారు. మావోయిస్టులపై నిషేధం ప్రజాస్వామ్యంపై నిషేధమని ఆయన అన్నారు. మావోయిస్టులు ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఉద్యమిస్తారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X